
ఐటీ రంగంలో డ్రగ్స్: జయేష్ రంజన్ స్పందన
హైదరాబాద్: డ్రగ్స్ మహమ్మారి ఐటీ రంగానికి కూడా విస్తరించడం కలకలం రేపుతోంది. సినీ ప్రముఖులు, పాఠశాల విద్యార్థులే కాదు టెకీలు సైతం మత్తులో చిత్తవుతున్నారు.. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ సిట్ దర్యాప్తులో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాతకాలు బయటపడ్డటంతో ఈ అంశంపై తాజాగా తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ స్పందించారు.
డ్రగ్స్ బారిన పడిన ఐటీ ఉద్యోగులు, కంపెనీల జాబితాను ఎక్సైజ్‌శాఖ తమకు ఇచ్చిందని తెలిపారు. ఆయా కంపెనీల మేనేజ్‌మెంట్‌తో తానే స్వయంగా మాట్లాడుతున్నట్టు వెల్లడించారు. ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన జాబితాలోని ఐటీ కంపెనీల్లో 20 నుంచి 30శాతం మంది ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పారు. కొంతమంది టెకీలు డ్రగ్స్ తీసుకున్నంతమాత్రాన ఐటీరంగం మొత్తం తీసుకున్నట్టు కాదని, దీనిని భూతద్దంలో చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎక్సైజ్‌శాఖ ఇచ్చిన జాబితాలో కంపెనీల పేర్లే తప్ప ఉద్యోగుల పేర్లు లేవని తెలిపారు.
డ్రగ్స్ ముఠా సభ్యులు కెల్విన్, ఖుదూస్, నిఖిల్ శెట్టి, విలియమ్స్, జీశాన్‌ల విచారణలో ఐటీ ఉద్యోగులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. పదుల కంపెనీల్లోని వందలాది మంది సిబ్బంది మత్తుకు బానిసయ్యారని స్వయంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వారి జాబితా రూపొందించి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌కు సమర్పించారు.