
నోట్లో యాసిడ్ పోసి.. నగలు, నగదు దోపిడీ
హైదరాబాద్ : హైదరాబాద్లోని నేరేడుమెట్లో శనివారం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం షాపులోకి ఇద్దరు యువకులు ప్రవేశించి... అభరణాలు చూపించాలని యజమానిని హిందీలో అడిగారు. దాంతో యజమాని మోహన్ వారికి అభరణాలు చూపిస్తున్నాడు. ఆ క్రమంలో అభరణాలు బలవంతంగా లాక్కొనేందుకు యత్నించారు. దీంతో మోహన్ ప్రతిఘటించాడు. ఆగ్రహించిన ఇద్దరు దొంగలు మోహన్ తలపై ఆయుధంతో బాది... నోట్లో యాసిడ్ పోశారు.
అనంతరం షాపు షటర్ను మూసివేసి ... షాపులోని 15 తులాల బంగారంతోపాటు నగదును దొంగలు బైక్పై పరారైయ్యారు. మోహన్ బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించి... పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మోహన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
యాసిడ్ కడుపులోకి వెళ్లడంతో ఆ భాగం మొత్తం మాడిపోయిందని అదికాక అతడు మాట్లాడలేక పోతున్నాడని తెలిపారు. పోలీసులు జ్యూయలరీ షాపునకు చేరుకుని.... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దొంగలు ఇద్దరు హిందీలో మాట్లాడారని మోహన్ కాగితంపై రాసి చూపించినట్లు పోలీసులు తెలిపారు.