హోటల్లో పేలుడు ఘటన: 82 మంది మృతి!
మధ్యప్రదేశ్ హోటల్లో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ వార్తాఛానళ్లు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 82 మందిమరణించారు. ఇంకా చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది. జబువా జిల్లా కేంద్రంలోని ఒక రెస్టారెంటులో గ్యాస్ సిలిండర్ లీకై.. పేలిపోవడంతో పైన ఉన్న రెండు అంతస్తులు కుప్పకూలాయి. పేలుడు కంటే, భవన శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగదిలో పేలుడు జరగటంతో... మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది.
దీంతో హోటల్లో ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రెస్టారెంట్ భవనం కూలి పక్కనే ఉన్న భవనాలపై పడటంతో.. రెండు భవనాలు కూడా ఒరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. కాగా మధ్యప్రదేశ్ హోం మంత్రిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తక్షణం అక్కడకు వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆదేశించారు.