జేఎస్‌పీఎల్ చేతికి రాష్ట్ర కంపెనీ కెనైటా పవర్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కైనటా పవర్ కంపెనీలో 100% వాటాను చేజిక్కించుకున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్) పేర్కొంది. జేఎస్‌పీఎల్ ఎండీ, సీఈఓ రవి ఉప్పల్ దీన్ని ధ్రువీకరించారు. అయితే, ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనేది వెల్లడించలేదు. నెల్లూరు జిల్లాలో 1,980 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కైనటా పవర్ వద్ద అనుమతులు ఉన్నాయి. ‘3-4 నెలల క్రితమే డీల్ కుదిరింది. సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల దూరంలో ప్లాంట్ స్థలం ఉంది. చుట్టూ ప్రహారీ గోడ సహా పర్యావరణ ఇతరత్రా అనుమతులన్నీ ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీని కొనుగోలు చేశాం. 660 మెగావాట్ల మూడు యూనిట్లు లేదా 800 మెగావాట్ల 2 యూనిట్ల చొప్పున విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఇక్కడ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం విద్యుత్‌కు డిమాండ్ తక్కువగా ఉండ టం వంటి కారణాలతో తక్షణం మేం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని భావిం చడం లేదు’ అని ఉప్పల్ చెప్పారు.
ఈ ప్రాజెక్టు వ్యయం రూ.10 వేల కోట్లవరకూ ఉండొచ్చని, కొనుగోలును దశలవారీగా పూర్తిచేసేలా ఒప్పందం కుదిరి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఈ ప్లాంట్‌ను నడిపించాలనేది జేఎస్‌పీఎల్ ప్రణాళికగా కూడా వారు పేర్కొంటున్నారు. దగ్గరలోనే రైల్వే స్టేషన్, జాతీయ రహదారి, కృష్ణపట్నం పోర్టు వంటి మౌలిక సదుపాయలన్నీ ఉండటంతో ఈ డీల్ జేఎస్‌పీఎల్‌కు చాలా ఉపయోగకరమేననేది పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వి. బాలశౌరి నేతృత్వంలోని కెనైటా మినరల్స్ ప్రమోట్ చేసిన కంపెనీయే కైనటా పవర్. ప్రతిపాదిత పవర్ ప్రాజెక్టుకు దాదాపు 1,200 ఎకరాల భూమిని ఇప్పటికే సమీకరించారు.