జిందాల్ స్టీల్ అండ్ పవర్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో ఉక్కు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దేశీయ ఉక్కు దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ధరలను టన్నుకు రూ.1,000 చొప్పున(2% వరకూ) పెంచాలని నిర్ణయించింది. ఇదే బాటలో ఇతర ఉక్కు కంపెనీలు-సెయిల్, ఎస్సార్ స్టీల్, టాటా స్టీల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్‌లు కూడా రానున్న రోజుల్లో ధరలను పెంచనున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
ఇనుప ఖనిజం ధరలు 2 శాతం, బొగ్గు ధరలు టన్నుకు 20 డాలర్లు చొప్పున పెరిగాయని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డెరైక్టర్ కమర్షియల్ అండ్ మార్కెటింగ్ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. ధరలు పెంచక తప్పని పరిస్థితని వివరించారు. ఎగుమతి ఆధారిత తయారీరంగ పరిశ్రమలు, వ్యవసాయాధారిత రంగాల నుంచి ఉక్కుకు డిమాండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రికవరీ బాట పడుతున్న పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా నుంచి కూడా ఉక్కుకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.