hikes prices
-
బంగారం డిమాండ్‌కు ధరల మంట
న్యూఢిల్లీ: బంగారానికి డిమాండ్ గడిచిన 10 రోజుల్లో పడిపోయింది. ఏకంగా 40 శాతం క్షీణించినట్టు ఉత్తరాది ఆభరణాల వర్తకులు చెబుతుంటే, దేశంలో బంగారం అత్యధికంగా అమ్ముడుపోయే దక్షిణాదిన గడిచిన రెండు వారాల్లో డిమాండ్ 60 శాతం తగ్గిపోయినట్టు ఈ ప్రాంత వర్తకులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం జీఎస్టీతో కలిపి రూ.60,000కు చేరుకోవడమే డిమాండ్ పడిపోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోళ్ల సీజన్ మొదలవుతుందని, ఇలాంటి తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు వారాల్లో బంగారం ధరలు 7 శాతం పెరిగాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసే బ్యాంకు సంక్షోభాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు విస్తరించొచ్చన్న భయాలు బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకు సంక్షోభాలతో పాశ్చాత్య దేశాల వృద్ధిపై ప్రభావం పడుతుందని, ఆర్బీఐ రేట్ల పెంపును తగ్గించొచ్చని, లేదంటే విరామం ఇవ్వొచ్చని, ఇది మార్కెట్లో నగదు లభ్యతను పెంచుతుందన్న అంచనాలు బంగారం ధరలకు మద్దతునిచ్చినట్టు తెలిపారు. అస్థిరతలకు అవకాశం.. ‘‘బంగారం ధరల్లో సమీప కాలంలో అస్థిరతలు కొనసాగొచ్చు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు తమ ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విధానాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ (28.34 గ్రాములు)కు 2,020 డాలర్లకు, దేశీయంగా రూ.60,500కు చేరుకోవచ్చు’’అని కామా జ్యుయలరీ ఎండీ కొలిన్‌షా తెలిపారు. ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా స్పందిస్తూ.. ‘‘బంగారానికి డిమాండ్ స్తబ్దుగా ఉంది. కొనుగోళ్లకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గింది. ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వేచి చూస్తోంది’’అని చెప్పారు. గడిచిన వారంలో బంగారం ధరలు ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగినట్టు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సియమ్ మెహ్రా తెలిపారు. ఇది దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసినట్టు చెప్పారు. ‘‘గత 10–15 రోజుల్లో డిమాండ్ 40 శాతం తగ్గింది. మరో 15 రోజుల్లో వివాహాల సీజన్ మొదలవుతున్నప్పటికీ, వేచి చూసే ధోరణితో ప్రజలు ఉన్నారు’’అని మెహ్రా వివరించారు. సీజ్ చేసిన స్మగుల్డ్ బంగారం @ 3,502 కేజీలు 2022లో 47 శాతం అప్ స్మగ్లింగ్‌లో పట్టుబడి, ప్రభుత్వ ఏజెన్సీలు సీజ్ చేసిన బంగారం పరిమాణం గతేడాది 3,502 కేజీలుగా నమోదైంది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 47 శాతం అధికం. కేరళలో అత్యధికంగా 755.81 కేజీల బంగారం పట్టుబడింది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (535.65 కేజీలు), తమిళనాడు (519 కేజీలు) ఉన్నాయి. రాజ్యసభకు ఆర్థిక శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం .. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు 2021లో 2,383.38 కేజీలు, అంతక్రితం ఏడాది 2,154.58 కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది (2023) తొలి మూడు నెలల్లో 916.37 కిలోల స్మగుల్డ్ బంగారాన్ని సీజ్ చేశాయి. 2021లో 2,445 పసిడి స్మగ్లింగ్ కేసులు, 2022లో 3,982 కేసులు నమోదయ్యాయి. బంగారం వినియోగంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. దేశీయంగా ఉత్పత్తి లేకపోవడంతో పసిడి కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే, కస్టమ్స్ సుంకం రేటు 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్సు (ఏఐడీసీ) 2.5 శాతం, ఐజీఎస్టీ రేటు 3 శాతం మొదలైనవన్నీ కలిపితే దిగుమతులపై పన్నుల భారం అధికంగా ఉంటోంది. దీనితో అక్రమ మార్గాల్లో కూడా దేశంలోకి పసిడి వస్తోంది. దీన్ని అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇతరత్రా ఏజెన్సీలతో కలిసి నిరంతరం నిఘాను పటిష్టం చేస్తోంది. ఎప్పటికప్పుడు స్మగ్లర్లు అనుసరించే కొత్త విధానాలను పసిగట్టి ఏజెన్సీలను అప్రమత్తం చేస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది. -
కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకీ షాక్!
మీరు రాబోయే కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే.. మీకు ఒక షాకింగ్ న్యూస్. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆటోమేకర్ పేర్కొంది. వివిధ ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల గత ఏడాది కాలంలో వాహనాల ఖర్చుపై ప్రతికూల ప్రభావం పడుతుందని మారుతి సుజుకి ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది. అయితే, ధరల పెరుగుదల వివిధ మోడల్స్ బట్టి మారుతుందని తెలిపింది. కార్ల ధరల పెంపు మొదటిసారి కాదు, ఈ సంవత్సరం ప్రారంభంలో అతిపెద్ద కార్ల తయారీదారు దేశవ్యాప్తంగా కార్ల ధరలను రూ.34,000 వరకు పెంచింది. ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, ఆటో పరిశ్రమ గత కొన్ని నెలలుగా కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో మారుతి సుజుకి ధరల పెంపును ప్రకటించింది. కార్ల తయారీదారు తన ఎంపిక చేసిన మోడల్స్ బట్టి ధరల పెంపు ₹1,000 నుంచి ₹22,500 వరకు ఉంది. ఇప్పటికే దెబ్బతిన్న పరిశ్రమను చిప్ కొరత, పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, కంటైనర్లు అందుబాటులో లేకపోవడం, అధిక షిప్పింగ్ రేట్లు ఇంకా దెబ్బతీస్తున్నాయని సంస్థ తెలిపింది. స్టీల్ & మెగ్నీషియం వంటి కీలక ముడి పదార్థాలకు లభ్యత లేకపోవడం కూడా పరిశ్రమపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇప్పటికే ధరల పెంపును ప్రకటించడంతో, ఇతర కార్ల తయారీదారులు కూడా ఇదే మార్గంలో నడవాలని చూస్తున్నాయి. (చదవండి: కియా నుంచి మరో కొత్త కారు...! ఇది వస్తే గేమ్ ఛేంజరే..!) -
పెట్రో ధరలపై ‘ధర్మ్ సంకట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య. దీనికి ధరలు తగ్గించడం తప్ప వేరే ప్రత్యామ్నాయ సమాధానం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. ‘వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ‘ధర్మ్ సంకట్’ పరిస్థితి. వినియోగదారులకు తుది ధర లేదా రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాలి’ అని నిర్మల వ్యాఖ్యానించారు. ఇంధన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నిర్ణయిస్తాయ ని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని ఆమె పేర్కొన్నారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్ వంటి ఖర్చులను బట్టి ఓఎంసీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు. -
ప్రయాణీకులకు షాకిచ్చిన ఐఆర్సీటీసీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు భారీ షాకిచ్చింది. పర్యాటక, క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ గురువారం విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో టీ, టిఫిన్, భోజనం రేట్లను పెంచింది. నవంబర్ 14 నుంచి రాజధాని / శతాబ్ది /దురంతో రైళ్లలో ప్రామాణిక భోజనంపై క్యాటరింగ్ సేవల రేట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విడుదల చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానంలో 15 రోజుల తరువాత అందిస్తామని, పెంచిన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తరువాత వర్తిస్తాయని తెలిపింది. రేట్ల సవరణ తరువాత రాజధాని, దురంతో, శాతాబ్డి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెంచారు. అదే స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20. ఇక భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో లంచ్/ డిన్నర్‌కు రూ. 120 రూపాయిలు చెల్లించాల్సిందే. మునుపటి ధర. రూ.80. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్ డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది) -
టీవీ ఛానెల్స్‌కు మంచి రోజులు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయివేటు టీవీ ఛానళ్లకు తీపి కబురు చెప్పింది. మొన్న వార్తాపత్రికలకు ఇచ్చే ప్రకటనల రేట్లను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ టీవీ ఛానళ్లకు ఇచ్చే ప్రకటన రేట్లను పెంచింది. ప్రయివేటు టీవీ చానెళ్లకు అందించే ప్రకటనల రేట్ల సవరణకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అంగీకరించిందని బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్(బీవోసీ) ప్రకటించింది. 11శాతం పెంచుతూ శుక్రవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. దేశీయంగా వారి ప్రదర్శన, రేటింగ్స్ ఆధారంగా న్యూస్, నాన్-న్యూస్ ఛానళ్లకు వైవిధ్యమైన రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ జనవరి 1, 2019న అందించిన నివేదిక ఆధారంగా ఈ రేట్లను సవరించినట్టు పేర్కొంది. కాగా ఇటీవల వార్తాపత్రికల కిచ్చే ప్రకటన రేట్లను 25శాతం పెంచుతూ బీవోసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నూనెలు సలసల
సాక్షి, విశాఖపట్నం: నింగిలో విహరిస్తున్న కూరగాయల ధరలకు నూనెలు, చింతపండూ తోడయ్యాయి. ఇవి ఏకమై సామాన్యుడిపై దాడి చేస్తున్నాయి. దాదాపు రెండున్నర నెలలుగా కాయగూరలు కారాలూ మిరియాలూ నూరుతున్నాయి. ఒక్క బంగాళాదుంపలు తప్ప మరే దుంపలూ, కూరగాయలూ కిలో రూ.30 నుంచి 100కు పైగానే ఎగబాకాయి. కార్తీకమాసం, అకాల వర్షాల పేరు చెప్పి వీటి ధరలను అమాంతం పెంచేశారు. కార్తీకమాసం పూర్తయినా వీటి రేట్లు నామమాత్రంగానే దిగివచ్చాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.50కి పైన ఉండగా, క్యారెట్ రూ.70 నుంచి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికీ పలు కూరగాయలు కిలో రూ.30 నుంచి 60 మధ్య పలుకుతున్నాయి. ఈ తరుణంలో వంట నూనెల ధరలు కూడా వాటికి వంత పాడుతున్నాయి. కొన్నాళ్లుగా లీటరు రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్టు రూ.76 నుంచి 78 మధ్య లభించేది. కొద్దిరోజుల క్రితం ఒక్కో ప్యాకెట్టుకు రూ.6–8 వరకు పెంచేశారు. దీంతో అది రూ.84 వరకు పెంచి విక్రయిస్తున్నారు. అలాగే రూ.62 ఉండే లీటరు పామాయిల్ ఇప్పుడు రూ.68–70కి పెరిగింది. హోల్‌సేల్‌లో 15 కేజీల రిఫైన్డ్ ఆయిల్ డబ్బా రూ.1180, పామాయిల్ రూ.980 ఉండేది. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ రూ.1250, పామాయిల్ రూ.1060కు చేరింది. ఇలా లీటరు ప్యాకెట్‌పై సగటున రూ.7, డబ్బాపై రూ.80 వరకు పెరిగింది. పెరిగిన ధరలను వ్యాపారులు వెనువెంటనే అమలులోకి తెచ్చారు. ఇటీవల ప్రభుత్వం నూనెలపై ఎక్సైజ్ డ్యూటీని 7.5 శాతం పెంచింది. ఇదే నూనెల ధరలు పెరుగుదలకు దారితీశాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా మలేసియా మార్కెట్ ఆధారంగా నూనెల ధరల పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. ఇప్పుడిప్పుడే మలేసియా మార్కెట్లో ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో నాలుగైదు రోజుల క్రితం నుంచే వంట నూనెల ధరలు తగ్గుతున్నా, పాత ధరకు కొనుగోలు చేసిన నిల్వలుండడంతో వ్యాపారులు ఆ మేరకు ఇంకా పూర్తి స్థాయిలో ధరలు తగ్గించడం లేదు. చింతపండుదీ అదే దారి.. ఇక చింతపండు కూడా కూరగాయలు, నూనెల ధరతో పోటీ పడుతోంది. నిన్న మొన్నటి దాకా పిక్కతో ఉన్న కిలో చింతపండు రూ.60–70, పిక్క తీసినది రూ.120–130 వరకు లభించేది. ఇప్పుడు ఏకంగా యాభై శాతానికి పైగా పెరిగిపోయింది. అంటే అరకిలో రూ.100, కిలో రూ.190–200కు పెరిగిపోయింది. హోల్‌సేల్ మార్కెట్లో 15 కిలోల పిక్కతీసిన చింతపండు నెల రోజుల క్రితం రూ.1650 ఉండేది. ఇప్పుడది రూ.2400కు ఎగబాకింది. చింతపండు నిల్వలు తగ్గిపోయాయన్న సాకుతో మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు. అంతేకాదు.. మున్ముందు ఇంకా పెరిగిపోతుందన్న ప్రచారాన్ని కూడా విస్తృతం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కూరగాయల ధరలతో సతమతమవుతున్న సగటు మధ్య తరగతి వారికి నిత్యావసర సరకులైన వంట నూనెలు, చింతపండు ధరలు కూడా మంట పెట్టిస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం చోద్యం చూస్తుండడంపై తీవ్రంగా మండి పడుతున్నారు. -
షాక్ ఇచ్చిన మారుతి సుజుకి
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన వాహనాల రేటును అమాంతం పెంచేసింది. వివిధ మోడళ్ల కార్ల ధరలను దాదాపు 20 వేలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించి వాహనదారులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ పెరుగుదల తక్షణమే అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కొత్తగా లాంచ్ చేసిన ఎస్యూవీ విటారా బ్రెజ్జా రూ .20,000, ప్రీమియం హ్యాచ్ బాక్ బాలెనో రూ 10,000 పైగా పెరగనుంది. ఎంపిక చేసిన శ్రేణి ధరల్లో పెంపు రూ .1,500 నుంచి రూ .5,000 మధ్య ఉంటుందని మారుతి తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే మారుతి వివిధ మోడళ్ల కార్ల ధరలను బట్టి ధరలు రూ. 1,441 నుంచి గరిష్టంగా 34,494 రూపాయల వరకు పెరిగాయని మారుతి సుజుకి వెల్లడించిన సంగతి తెలిసిందే. 2016-17 కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల సెస్ కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ భారత్ లో నెలకొన్న డిమాండ్ రీత్యా మారుతి లాభాల్లో దూసుకుపోయింది. ఈ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకుమించిన నమోదౌనాయి. లక్షా 37 వేలకు పైగా (1,37,116) అమ్మకాలతో భారీ ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో రూ.1,486.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ. 1,208.10 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనబరిచింది. ముడి సరుకుల ధరలు తగ్గుముఖం పట్టడం, నిర్వహణేతర ఆదాయం పుంజుకోవడం మెరుగైన ఫలితాలు ప్రకటించేందుకు దోహదపడినట్లు ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ బీఎస్ఈకి తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం ఎగబాకి రూ.14,654.50 కోట్లకు చేరుకున్నాయి. -
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో ఉక్కు ధరలు పెరిగే అవకాశాలున్నాయి. దేశీయ ఉక్కు దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఉక్కు ధరలను టన్నుకు రూ.1,000 చొప్పున(2% వరకూ) పెంచాలని నిర్ణయించింది. ఇదే బాటలో ఇతర ఉక్కు కంపెనీలు-సెయిల్, ఎస్సార్ స్టీల్, టాటా స్టీల్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్లు కూడా రానున్న రోజుల్లో ధరలను పెంచనున్నాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఇనుప ఖనిజం ధరలు 2 శాతం, బొగ్గు ధరలు టన్నుకు 20 డాలర్లు చొప్పున పెరిగాయని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ డెరైక్టర్ కమర్షియల్ అండ్ మార్కెటింగ్ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. ధరలు పెంచక తప్పని పరిస్థితని వివరించారు. ఎగుమతి ఆధారిత తయారీరంగ పరిశ్రమలు, వ్యవసాయాధారిత రంగాల నుంచి ఉక్కుకు డిమాండ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని పేర్కొన్నారు. అంతేకాకుండా రికవరీ బాట పడుతున్న పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా నుంచి కూడా ఉక్కుకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.