షాక్ ఇచ్చిన మారుతి సుజుకి
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తన వాహనాల రేటును అమాంతం పెంచేసింది. వివిధ మోడళ్ల కార్ల ధరలను దాదాపు 20 వేలకు పైగా పెంచుతున్నట్టు ప్రకటించి వాహనదారులకు షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ పెరుగుదల తక్షణమే అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కొత్తగా లాంచ్ చేసిన ఎస్యూవీ విటారా బ్రెజ్జా రూ .20,000, ప్రీమియం హ్యాచ్ బాక్ బాలెనో రూ 10,000 పైగా పెరగనుంది. ఎంపిక చేసిన శ్రేణి ధరల్లో పెంపు రూ .1,500 నుంచి రూ .5,000 మధ్య ఉంటుందని మారుతి తెలిపింది.
ఈ ఏడాది మార్చిలోనే మారుతి వివిధ మోడళ్ల కార్ల ధరలను బట్టి ధరలు రూ. 1,441 నుంచి గరిష్టంగా 34,494 రూపాయల వరకు పెరిగాయని మారుతి సుజుకి వెల్లడించిన సంగతి తెలిసిందే. 2016-17 కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల సెస్ కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది.
కాగా కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ భారత్ లో నెలకొన్న డిమాండ్ రీత్యా మారుతి లాభాల్లో దూసుకుపోయింది. ఈ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకుమించిన నమోదౌనాయి. లక్షా 37 వేలకు పైగా (1,37,116) అమ్మకాలతో భారీ ఆదాయాన్ని ఆర్జించింది. జూన్ 30తో ముగిసిన మూడు నెలల్లో రూ.1,486.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ. 1,208.10 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం వృద్ధి కనబరిచింది. ముడి సరుకుల ధరలు తగ్గుముఖం పట్టడం, నిర్వహణేతర ఆదాయం పుంజుకోవడం మెరుగైన ఫలితాలు ప్రకటించేందుకు దోహదపడినట్లు ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ బీఎస్‌ఈకి తెలిపింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో కంపెనీ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం ఎగబాకి రూ.14,654.50 కోట్లకు చేరుకున్నాయి.