ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళ ఇకలేరు
టోక్యో: ఒకరు చెబితే వినదు. తానుగా ఎంచుకుంటే తప్ప ఎవ్వరినీ దరిచేరనీయదు. అలా ఇప్పటివరకు ఎవరెస్ట్ ఎంతో మందిని అనుగ్రహించింది. అయితే తనను చేరుకున్న అందరిలోకి అత్యంత ప్రియమైన వ్యక్తి 'జుంకే తాబెయ్'అని ఘంటాపథంగా చెబుతుంది. ఎందుకంటే జుంకే.. ఎవరెస్ట్ కు రెస్ట్ కావాలని నినదించింది. పర్వతరాజం మనసును అంతలా అర్థం చేసుకున్న పర్వతారోహకురాలు ప్రపంచంలో జుంకే ఒక్కరే.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ జుంకే తాబెయ్ (77) కన్నుమూశారు. క్యాన్సర్ బారినపడిన ఆమె టోక్యో శివారులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారని జపాన్ వార్తా సంస్థలు ఆదివారం వెల్లడించాయి. ఒక్క ఎవరెస్ట్ నే కాక ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను సైతం పాదాక్రాంతం చేసుకున్నారామె. భూగోళంపై (పర్వతాలున్న)190 దేశాల్లోనూ ఎత్తైనవాటిని అధిరోహించాలని జుంకే కలలు కన్నారు. ఆ ప్రయత్నంలో ఉండగానే.. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసింది. అయినాసరే, పర్వతారోహణను మాత్రం మానుకోలేదామె. చివరిదశలో తప్ప జీవితంలోని ప్రతి క్షణాన్ని జుంకే తాబెయ్ సాహసోపేతంగా గడిపింది.
జపాన్ లోని ప్రఖ్యాత పుకుషిమా నగర శివారు కొండ ప్రాంతం (1939లో)మిహారులో జన్మించిన జుంకో.. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి పర్వతారోహణ చేసింది. క్లాస్ టీచర్ తో కలిసి చేసిన ఆ సాహసం ఆమె ఆలోచనావిధానాన్ని పూర్తిగా మార్చేసింది. టీనేజ్ లోనే పర్వతారోహణకు సంబంధించిన అన్ని విషయాలు ఒంటపట్టించుకుంది. నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 1975, మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 'ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ'గా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. అంతకు ముందు, ఆ తర్వాత ఎన్నెన్నో శిఖరాలను విజయవంతంగా అధిరోహించింది జుంకో. ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన ఘనతను కూడా సొంతం చేసుకుంది.
'మా కాలంలో ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కడమనేది ఊహకందని విషయం. అలాంటిది నేను సాధించినందుకు ఎప్పుడూ సంతోషపడతా'అని చెప్పే జుంకో తాబెయ్.. 2000లో క్యుషు యూనివర్సిటీ నుంచి పారిశుద్ధ్య నిర్వహణలో డిగ్రీ పూర్తిచేశారు. అటుపై ఎవరెస్ట్ పరిశుభ్రతకు నడుంబిగించారు. టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలు మొదటిసారి ఎవరెస్ట్ ను అధిరోహించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2003లో నేపాల్ లో పెద్ద కార్యక్రమం జరిగింది. అక్కడ చరిత్రాత్మక ప్రసంగం చేసిన జుంకే.. ఎవరెస్ట్ కు విశ్రాంతికావాలని నినదించారు. ఆ గంభీర పర్వతానికి కొన్నేళ్లయినా వెళ్లకుండా ఉంటే మంచిదని సూచించారు. జుంకే మరణం పట్ల జపాన్, నేపాల్ ప్రభుత్వాలతోపాటు పలువురు పర్వతారోహకులూ సంతాపం వ్యక్తం చేశారు.