
విమానం నుంచి ఈడ్చిపారేశారు!
న్యూయార్క్: ప్రయాణికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానం నిండిపోయిందన్న సాకుతో ప్రయాణికుడిని ఈడ్చిపడేసిన ఘటన వెలుగుచూడడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పై మండిపడుతున్నారు. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
షికాగో నుంచి కెంటకీలోని లూయిస్ విల్లే యునైటెడ్ 3411 విమానంలో ఎక్కి కూర్చున్న ప్రయాణికుడిని కిందకు దిగాలని సెక్యురిటీ సిబ్బంది ఆదేశించారు. తాను తప్పనిసరిగా ఇంటికి వెళ్లాల్సివుందని బతిమాలినా సెక్యురిటీ వినిపించుకోలేదు. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయారు. కిందపడిపోయినా లెక్కచేయకుండా ఈడ్చుకుంటూపోవడంతో అతడికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునేందుకు ప్రయాణికులెవరూ ముందుకు రాలేదు. ఈ దుశ్చర్యను వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశారు. బాధితుడు ఆసియా వాసి అయివుంటాడని భావిస్తున్నారు.
తాను వైద్యుడినని ఇంటికి తిరిగివెళుతున్నట్టు విమాన సిబ్బందితో బాధితుడు చెప్పినట్టు ప్రయాణికులు వెల్లడించారు. రక్తమోడుతూ గాయాలతో మళ్లీ విమానంలోకి వచ్చిన బాధితుడు.. 'నన్ను చంపేయండి.. చంపడి. నేను ఇంటికి వెళ్లాల'ని వేడుకున్నా విమాన సిబ్బంది కనికరించలేదని తెలిపారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పేది లేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ మొండిగా సమాధానం ఇవ్వడం గమనార్హం. లెగ్గింగ్స్ వేసుకున్నారని ఇద్దరు అమ్మాయిలను గత నెలలో విమానం ఎక్కనీయకపోవడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమర్శలపాలైంది.