United Airlines Plane
-
అది దారుణమే.. మమ్మల్ని క్షమించండి!
-
ఔను అది దారుణమే.. మమ్మల్ని క్షమించండి!
షికాగో: ప్రయాణికుడిని దారుణంగా విమానం నుంచి ఈడ్చిపారేసిన ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. జరిగిన ఘటన బాధాకరమే అంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఆదివారం షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అధికంగా టికెట్లు బుక్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో సీట్లు ఖాళీగా లేవనే కారణంతో 69 ఏళ్ల డేవిడ్ డావో అనే ప్రయాణికుడిపై విమాన సిబ్బంది దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. ’నన్ను చంపండి.. అంతేకానీ నేను ఇంటికి వెళ్లాలి’ అని ఆసియాకు చెందిన డాక్టర్ అయిన ఆయన ఎంత వేడుకున్నా.. కనికరించని సిబ్బంది ఆయనను అత్యంత కిరాతకంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు. ఈ క్రమంలో ఆయన నోటినుంచి రక్తం ధారాళంగా కారినా పట్టించుకోలేదు. ఈ అమానుషాన్ని తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోలను చూసి దిగ్భ్రాంతిచెందిన నెటిజన్లు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈసీవో ఆస్కార్ మునోజ్ స్పందించారు. ‘మా విమానంలో జరిగిన ఘటన నన్ను కలత పెడుతున్నది. బలవంతంగా విమానం నుంచి ఈడ్చేసిన ప్రయాణికుడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రయాణికులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. — Enrico Valenzuela (@enricovalen) 11 April 2017 -
విమానం నుంచి ఈడ్చిపారేశారు!
-
విమానం నుంచి ఈడ్చిపారేశారు!
న్యూయార్క్: ప్రయాణికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానం నిండిపోయిందన్న సాకుతో ప్రయాణికుడిని ఈడ్చిపడేసిన ఘటన వెలుగుచూడడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పై మండిపడుతున్నారు. షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. షికాగో నుంచి కెంటకీలోని లూయిస్ విల్లే యునైటెడ్ 3411 విమానంలో ఎక్కి కూర్చున్న ప్రయాణికుడిని కిందకు దిగాలని సెక్యురిటీ సిబ్బంది ఆదేశించారు. తాను తప్పనిసరిగా ఇంటికి వెళ్లాల్సివుందని బతిమాలినా సెక్యురిటీ వినిపించుకోలేదు. ప్రయాణికుడి చొక్కా పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయారు. కిందపడిపోయినా లెక్కచేయకుండా ఈడ్చుకుంటూపోవడంతో అతడికి గాయాలయ్యాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునేందుకు ప్రయాణికులెవరూ ముందుకు రాలేదు. ఈ దుశ్చర్యను వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశారు. బాధితుడు ఆసియా వాసి అయివుంటాడని భావిస్తున్నారు. తాను వైద్యుడినని ఇంటికి తిరిగివెళుతున్నట్టు విమాన సిబ్బందితో బాధితుడు చెప్పినట్టు ప్రయాణికులు వెల్లడించారు. రక్తమోడుతూ గాయాలతో మళ్లీ విమానంలోకి వచ్చిన బాధితుడు.. 'నన్ను చంపేయండి.. చంపడి. నేను ఇంటికి వెళ్లాల'ని వేడుకున్నా విమాన సిబ్బంది కనికరించలేదని తెలిపారు. ఈ ఘటనపై క్షమాపణ చెప్పేది లేదని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ మొండిగా సమాధానం ఇవ్వడం గమనార్హం. లెగ్గింగ్స్ వేసుకున్నారని ఇద్దరు అమ్మాయిలను గత నెలలో విమానం ఎక్కనీయకపోవడంతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమర్శలపాలైంది. -
విమానంలో జగడం షికాగోకు దారి మళ్లింపు
న్యూయార్క్: ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం గొడవ పడటం.. మాటా మాటా పెరిగి చివరికి కొట్టుకునేదాకా వెళ్లడమూ మనకు అప్పుడప్పుడూ అనుభవంలోకి వచ్చేదే. అయితే, బస్సుల్లోనే కాదు.. విమానాల్లో సైతం ఇలాంటి చిల్లర గొడవలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం అమెరికాలో న్యూయార్క్ నుంచి డెన్వర్‌కు వెళుతున్న యునెటైడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జగడం వల్ల ఆ విమానాన్ని షికాగోకు దారిమళ్లించాల్సి వచ్చింది. ఆనక వారిని షికాగోలోనే దించేసి విమానం గంటన్నర ఆలస్యంతో తిరిగి డెన్వర్‌కు బయలుదేరింది. విమానంలో వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి తన ముందు సీటును వెనక్కి వాల్చేందుకు వీలుకాకుండా ‘నీ డిఫెండర్’ అనే పరికరాన్ని బిగించాడు. దీంతో ముందు కూర్చున్న ఓ మహిళ తన సీటును వాల్చేందుకు ప్రయత్నించి, పరికరాన్ని చూసింది. విమానాల్లో అలాంటి పరికరాలు నిషిద్ధమని, దానిని తొలగించాలని విమాన సిబ్బంది కూడా నచ్చచెప్పారు. అయినా వినకుండా.. తనకు ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి స్థలం కావాలంటూ అతడు మొండిపట్టు పట్టాడు. కోపంతో ఊగిపోయిన ఆ మహిళ గ్లాసులో నీళ్లు తీసుకుని అతడి ముఖంపై విసిరికొట్టింది. ఇంకేం.. ఇద్దరి అరుపులతో విమానం దద్దరిల్లిపోయింది. వారి గొడవ ఆగే పరిస్థితి కనిపించకపోవడంతో విమానాన్ని అర్ధంతరంగా సమీపంలోని షికాగోకు మళ్లించి దింపేశారు. బిలబిలమంటూ పోలీసులు, విమానాశ్రయ అధికారులు పరుగెత్తుకొచ్చారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారినక్కడే వదిలేసి విమానం డెన్వర్‌కు చేరుకుంది. ఇది వినియోగదారుల వ్యవహారం కావడంతో వారిపై కేసులు పెట్టలేదట.