చిల్లుల బిల్లు : కేసీఆర్ | K Chandrasekhar Rao Object drafted Telangana bill | Sakshi
Sakshi News home page

చిల్లుల బిల్లు : కేసీఆర్

Published Sat, Dec 7 2013 1:53 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

చిల్లుల బిల్లు : కేసీఆర్ - Sakshi

చిల్లుల బిల్లు : కేసీఆర్

టీ బిల్లు ముసాయిదాలో ఎన్నో లొసుగులున్నాయి: కేసీఆర్
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర కేబినెట్ ఆమోదించిన ముసాయిదా బిల్లులో తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని,వాటిపై ప్రధానమంత్రిని కలుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిపి న సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెన్షన్లు పంపకంలో జనాభా ప్రాతిపదిక, అడ్మిషన్లలో పాతవిధానం, ఆస్తులు-అప్పుల పంపకంలో సమానవాటా అంటూ బిల్లులో చెప్పిన అంశాలు తెలంగాణ ప్రజలకు అంగీకారం కాదన్నారు. వీటిపై బిల్లులో సవరణలు చేయాలంటూ ప్రధానమంత్రికి లేఖరాస్తామని, వీలుంటే ప్రతినిధి బృందంగా కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పట్టుదల, దృఢచిత్తం వల్లనే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం జరిగిందని కేసీఆర్ కొనియాడారు.
 
 10 జిల్లాలతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలంటూ నిర్ణయించిన ప్రధానమంత్రికి, కేంద్ర కేబినెట్‌కు, సహకరిస్తున్న బీజేపీ, ఇతరపార్టీలకు ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. 1969లో ఉద్యమం ఫెయిలైనా 14 ఏండ్ల కిందట కొత్త పంథాతో, సరికొత్త వ్యూహంతో చేసిన ఉద్యమానికి అన్నివర్గాలు అద్భుతమైన ఐక్యతను ప్రదర్శించినాయన్నారు. పార్టీ ముఖ్యనేతలు కె.కేశవరావు, నాయిని నర్సింహ్మారెడ్డి, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, మందా జగన్నాధం, ఎస్.మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్‌లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు, కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం, సీమాంధ్రుల భయాందోళనలు వంటివాటిపై కేసీఆర్ మాటల్లోనే...
 పార్లమెంటులో నెగ్గిన తర్వాతనే పండుగ: ఉద్యమకారుడు లక్ష్యం చేరేదాకా రిలాక్స్ కాడు. ప్రజలు కోరుకున్న తెలంగాణకు పార్లమెంటులో బిల్లు పాస్‌కావాలి. ఉభయసభల్లో బిల్లు పాసయినంక ప్రపంచంలోనే ఎవరూ జరుపుకోనంత పెద్దగా పండుగ చేసుకుంటం.
 
 వరంగల్‌లోనే 25 లక్షల మందితో సభ పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటం. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ముసాయిదా బిల్లుపై మాకు అసంతృప్తి ఉంది. ఉదయం నుండి ఆయా రంగాలు నిపుణులు అధ్యయనం చేస్తున్నరు. దేశంలో ఇప్పటికే 28 రాష్ట్రాలుంటే వాటికి లేని ఆంక్షలు ఒక్క తెలంగాణకే ఎందుకు? ఆ రాష్ట్రాలతో కేంద్రానికి ఎలాంటి సంబంధాలున్నయో తెలంగాణ రాష్ట్రానికీ అట్లానే ఉండాలి. దేశమంతా ఒక చట్టం ఉంటే తెలంగాణకు మరోటి ఉంటదా? తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి తెలంగాణ మంత్రివర్గంపై కొన్ని అంశాల్లో గవర్నరుకు సూపర్‌పవర్ ఎట్ల ఇస్తరు? ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలను ఎట్ల తగ్గిస్తరు? రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలంటే తెలంగాణకు అన్యాయం జరుగుతది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విలీనయమ్యేనాడున్న పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధనలను పక్కనబెట్టి 80 వేల తెలంగాణవారి ఉద్యోగాలు సీమాంధ్రులకు కట్టబెట్టిండ్రు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి జీఓ 36 ద్వారా పంపుతమని చెప్పినా అమలుకాలేదు. ఎన్టీఆర్ హయాంలో తెచ్చిన జిఓ 610 అమలు కాలేదు. వారు రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చింది.
 
 మా ఉద్యోగాలు పొయినయి. ఇప్పుడు వారి పెన్షన్ భారం కూడా తెలంగాణ భరించాల్నా? జనాభా ప్రాతిపదికన కాకుండా స్థానిక,స్థానికేతర ఆధారంగా విభజన చేయాలె. విద్యలో అడ్మిషన్లు కూడా పాత పద్ధతే అంటే ఘర్షణ వస్తది. ఈ విద్యా సంవత్సరంలోనే అనుమతులు తెచ్చి ఏ రాష్ట్రంలోని అడ్మిషన్లు ఆ రాష్ట్రానికే చెందాలె. అప్పులు కూడా జనాభా ప్రాతిపదికన కాకుండా ఏ రాష్ట్రంలో ప్రాజెక్టు ఉంటే ఆ రాష్ట్రానికే అప్పులు చెందాలె. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు చెరిసగం కాకుండా అంతకుముందు ఎవరివి అయితే వారికే ఆ ఆస్తులు చెందాలె. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌ను అమ్మేశారు. నిజాంకు, హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన ఏపీభవన్ తెలంగాణకే ఉండాలె. తెలంగాణ సొత్తులో వాటా ఇవ్వడానికి తెలంగాణ అంగీకరించదు. ఆంధ్రరాష్ట్రంలో వెంటనే హైకోర్టు ఏర్పాటుచేయాలె. నదీజలాల పంపకంలో కొన్ని అభ్యంతరాలున్నయి. రాజ్యసభలోనూ సభ్యుల రిటైరయ్యే వారిలో సమాన భాగం ఇవ్వాలె. ఉమ్మడి రాజధాని కూడా 5 ఏళ్లుంటే చాలునని అన్నాం. వీటిపై పార్లమెంటులో చర్చ సందర్భంగా సవరణ చేయాలని ప్రధానమంత్రికి లేఖ రాస్తం. అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తం.
 
 విలీనంపై అర్జంటేంది...?: విలీనం చేస్తరా అనేది పనికిమాలిన ప్రశ్న. టీఆర్‌ఎస్ విలీనం మాకన్నా మీకే(విలేకరులకు) ఎక్కువ అర్జెంటున్నట్టుంది. అంత అర్జంటేంది? పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందాక విలీనంపై మాట్లాడుకుంటం. తెలంగాణ మా వల్లనే వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటే కాదు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో ప్రజలు చెప్పాలె. అసెంబ్లీ స్థానాల పెంపు పనికివచ్చేది కాదు. తెలంగాణ కన్నా 17 రాష్ట్రాలు చిన్నగా ఉన్నయి, అసెంబ్లీ స్థానాల పెంపు ప్రస్తావన డ్రాఫ్టు బిల్లులో లేకుంటే ఆ ప్రతిపాదన లేనట్టే.
 
 సీమాంధ్ర నేతల ఆత్మవంచన: సీమాంధ్ర నేతలు ఇంకా ఆత్మవంచన చేసుకుంటూ అక్కడి ప్రజలను వంచిస్తున్నరు. సీమాంధ్ర రాజధానికోసం, అభివృద్ధికోసం 5లక్షల కోట్లు కాకుంటే 10 లక్షల కోట్లు ఇచ్చినా అభ్యంతరం లేదు.  అయినా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదన్నా అడిగితే హేతుబద్దంగా, బాధ్యతతో, సమంజసంగా అడగాలె. కేంద్ర ప్రభుత్వమంటే ఒక బడ్జెట్టుంటది, పద్ధతి ఉంటది.సూట్‌కేసుల నిధులు పెట్టుకుని రెడీ ఉండి, తీసుకుపో అని ఇస్తరా? ఇన్నేండ్ల ఉద్యమంలో ఇక్కడుంటున్న సీమాంధ్రులపై ఒక్కరిపైనన్నా దాడి జరిగిందా? తెలంగాణవారికి ఎన్ని హక్కులుంటయో వారికి అట్లనే ఉంటయి. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు అయ్యేవారికి పనిచేయడానికే 24 గంటలు సరిపోవు. శాంతిభద్రతలు కూడా సమస్యగా మారితే ముందుకుపోతమా? సీమాంధ్రుల విషయంలో అపోహలు, భయాందోళనలు అవసరం లేదు. వారి భద్రతకు నాదే బాధ్యత. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తదని కేంద్ర హోంమంత్రి షిండే చెబుతుంటే ఇంకా అనుమానమెందుకు?
 
 విలీనంకంటే పొత్తుకే మొగ్గు: కేసీఆర్
 విలీనం చేసుకోవడం కంటే పొత్తు పెట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నదని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. విలేకరుల సమావేశం ముగిశాక ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ‘విలీనం చేసుకోవడం వల్ల ఇద్దరికీ చాలా ఇబ్బందులుంటయి. మేం కావాలంటున్న సీటులోనే వారికి అనివార్యత ఉండొచ్చు. మాకు తప్పనిసరి అనుకున్న సీటులోనే వారికి అవసరం (కంపల్షన్) ఉండొచ్చు. అదేమన్నా జేబులోని పెన్నా అడగ్గానే తీసివ్వడానికి. విలీనమంటే చాలా ఇబ్బందులు, సమస్యలుంటయి. అయితే విలీనం చేసుకోవాలని కాంగ్రెస్‌కు కూడా లేదు. పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ వాళ్లు అంతర్గతంగా అనుకుంటున్నరు.
 
 ఇంకా నా దగ్గరకు రాలేదు కానీ మా వాళ్లతో మాట్లాడుతున్నట్టున్నరు’ అని కేసీఆర్ వెల్లడించారు. ‘ఉమ్మడి రాజధాని అనేది రాజ్యాంగంలోనే లేదు. కొన్ని ఆంక్షలు సీమాంధ్రుల సంతృప్తికోసం పెట్టినా రాజ్యాంగంలో నిలబడవు. లోక్‌సభలో, రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు సవరణల ద్వారా వీటిని కూడా కొట్టేస్తరు. ఆంక్షలేమీ ఉండకపోవచ్చు. ఏదేమైనా జనవరి నెలలోనే కొత్త రాష్ట్రంలో ఉంటం. నేడో, రేపో రాష్ట్రపతికి బిల్లు పోతది. అక్కడ ఒక్కరోజుకన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. శీతాకాల సమావేశాల్లోనే బిల్లు అయిపోతది’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement