ప్రజల గొడవే... కాళోజీ ‘నా గొడవ’
కాళోజీ జయంత్యుత్సవంలో కడియం శ్రీహరి
{పశ్నించేతత్వాన్ని అందరూ అలవరచుకోవాలి
అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం-2015 ప్రదానం
హైదరాబాద్: ప్రజల గొడవను తన గొడవగా సమాజంలోని సమస్యలను రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మహావ్యక్తి కాళోజీ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కితాబునిచ్చారు. బుధవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం -2015 ప్రదానం చేశారు. అనంతరం కడియం మాట్లాడుతూ కాళోజీ ఎవరికీ బయపడని ధీరత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. ప్రాంతాల వారీగా మాండలికాలు ఉన్నాయని, తెలంగాణ మాండలికం కూడా భాషే అని తన కవిత్వం ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ఆయనపై ఉన్న గౌరవంతో అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ క్షేత్రానికి ప్రభుత్వం భూమి, నిధులు కేటాయించిందని చెప్పారు. కాళోజీ ప్రశ్నించేతత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని సూచించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ రోజుల్లో ధైర్యంగా తిరుగుతూ తన రచనలు చదువుతూ ప్రజల్లో ప్రసంగాలు చేసేవారన్నారు.
విద్యార్థిగా ఉన్న రోజుల్లో కాళోజీతో కలసి పనిచేశానని చెప్పారు. రాజ్యహింసకు వ్యతిరే కంగా ‘మూమెంట్ ఫర్ అప్రెషన్’ స్థాపించారని, దానికి తానూ కాళోజీ నాయకత్వం వహించేవారమని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాళోజీ పేరిట భాషాదినోత్సవం నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ ‘ఆగిపోయిన.. ముందుకు సాగలేవు నీవు’ అనే కాళోజీ కవితను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మహనీయులకు మరణాలు ఉండవని, జయంతులు మాత్రమే ఉంటాయన్నారు. తెలంగాణ మట్టి గడ్డపై పుట్టిన ప్రతివారికీ తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన మహారుషి కాళోజీ అని కొనియాడారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది కాళోజీ జయంతిని వరంగల్‌లోని కళా క్షేత్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరికి సూచించారు. కాళోజీ పురస్కార స్వీకర్త డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ మాట్లాడుతూ మహనీయుని పేరిట ఏర్పాటుచేసిన తొలి పురస్కారం తనకి ప్రదానం చేసిందుకు ప్రభుత్వానికి, సీఎంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహాకవి కంటే ప్రజాకవి అయిన కాళోజీనే గొప్పవారన్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి గాయకుడు జంగిరెడ్డి బృందం కాళోజీపై పాడిన పాటలు ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహితీవేత్త డాక్టర్ ఎస్‌వీ సత్యనారాయణ, వి.ఆర్. విద్యార్థి, కాళోజీ కుమారుడు రవికుమార్ పాల్గొన్నారు.