కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం | Karnataka train accident, several injured | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం

Published Sat, Sep 12 2015 4:55 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం - Sakshi

కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం

-పట్టాలు తప్పిన సికింద్రాబాద్- ముంబై (కుర్లా) ఎల్టీటీ దురంతో ఎక్ప్ ప్రెస్ రైలు

- ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

- సహాయక చర్యల్లో ఆలస్యం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

కర్ణాటకలో శనివారం తెల్లవారుజామున రైలుప్రమాదం సంభవించింది. రాత్రి 11.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన సికింద్రాబాద్-ముంబై ఎల్టీటీ దురంతో ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ షాహబాద్ స్టేషన్ దాటిన తర్వాత తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మార్టూర్ వద్ద 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా,  పలువురు  తీవ్రగాయాలయినట్టు రైల్వే అధికారులు తెలిపారు.110  కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కుర్లా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం తెలిసిన వెంటనే రైల్వే శాఖ సహాయక బృందాలు ప్రమాద స్థలికి పరుగుతీశాయి. అయితే అర్థరాత్రి చిమ్మచీకటి కావడంతో సహాయచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శిథిలాల్లో ఇరుక్కుపోయినవారి ఆర్తనాదాలు, తమవారు ఎక్కడున్నారో తెలియక పలువురు ప్రయాణికులు రోదించడం అక్కడ కనిపించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. 

 

ఈ ప్రమాదం కారణంగా చెన్నై, ముంబై సికింద్రాబాద్ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రిస్క్యూ టీం, రైల్వే పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.  క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement