karnataka train accident
-
అక్కడ పట్టాలు తప్పితే పైలోకాలకే..
బెంగళూరు, మైసూర్, హుబ్లీ, గుల్బర్గా డివిజన్లను కలుపుతూ హుబ్లీ కేంద్రంగా 2003, ఏప్రిల్ 1న ఏర్పాటైన నైరుతి (సౌత్ వెస్ట్రన్) రైల్వే జోన్ భారీ ప్రమాదాల అడ్డాగా మారింది. శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్- ముంబై (కుర్లీ) ఎల్టీటీ దురంతో ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 12220) పట్టాలు తప్పిన మార్టూరు రైల్వే స్టేషన్ కూడా ఇదే జోన్ (గుల్బర్గా డివిజన్) పరిధిలోనే ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రైలు అత్యధికంగా 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు. అంటే ప్రమాద సమయంలో సాధారణ వేగంతో ఉన్నట్టే లెక్క. ట్రాక్ ఏమైనా కొట్టుకుపోయిందా అంటే అలాంటి దాఖలాలేవీ కనిపించలేదు. మరి ప్రమాదం ఎలా జరిగినట్లు? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి లభించే సమాధానం.. నిర్లక్ష్యం ఒక్కటే. ట్రాక్ నిర్వహణపట్ల ఆ డివిజన్ అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు బలి కావడానికి కారణమయింది. ఇదే జోన్ లో ఈ ఏడాది ఆగస్టు 24న కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లోని అనెకల్ రోడ్డు-హోసూరు వద్ద జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు- ఎర్నాకుళం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో ఆ ప్రమాదం జరిగింది. అయితే ఇంజన్లో మంటలు చెలరేగినందున సాకేతిక సమస్యలు తలెత్తాయని, అందుకే పట్టాలు తప్పాయని రైల్వే శాక అంతర్గత నివేదిక పేర్కొంది. సహజంగా అన్ని జోన్లలో రైళ్లు పట్టాలు తప్పాయన్న వార్తలు ఎప్పుడూ వినేవే. కానీ నైరుతి జోన్ లో రైలు పట్టాలు తప్పిందంటే మాత్రం కచ్చితంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుండటం గమనార్హం. సాంకేతికతను విస్తరించడంలో నెలకొన్న ఆలస్యానికి తోడు, సిబ్బంది కొరత కూడా ఈ ప్రమాదాలకు ఇతర కారణాలుగా తెలుస్తున్నాయి. శనివారం నాటి ప్రమాదంలో మర్టూరు స్టేషన్ను పరిశీలిస్తే నైరుతి రైల్వే జోన్ ఎలాంటి దుస్థితిలో ఉన్నదో ఇట్టే అర్థమవుతుంది. -
రైలు ప్రమాద బాధితులకు పరిహారం
న్యూఢిల్లీ: కర్ణాటకలోని గుర్బర్గాకు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో బాధితులకు రైల్వే శాఖ నష్టపరిహారం ప్రకటించింది. మృతి చెదిన ఎనిమిది మంది కుటుంబాలకు తలా రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి తలా రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ. 25 వేల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె. మిట్టల్ తెలిపారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. ఈ ఘోరం ఎలా జరిగిందనేదానిపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు మిట్టల్ పేర్కొన్నారు. ఇందుకోసం రైల్వే సేఫ్టీ కమిషనర్ (సెంట్రల్ సర్కిల్) నేతృత్వంలో విచారణ బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపేశామని, మరమ్మతుల అనంతరం తిరిగి సేవలను పునరుద్ధరించామని, ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడదని ఆయన చెప్పారు. -
రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు
సికింద్రాబాద్ నుంచి కుర్లా (ముంబై) వెళుతున్న దురంతో ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ గుర్బర్గాకు సమీపంలో పట్టాలు తప్పిన సంఘటనకు సంబంధించి రైల్వే శాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటుచేసింది. రైలు ప్రమాదం హెల్ప్ లైన్స్: సికింద్రాబాద్-040-27700868, హైదరాబాద్-040-23200865 రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు: వికారాబాద్- 08416-252103, తాండూరు- 08400-272010 -
కర్ణాటకలో ఘోర రైలు ప్రమాదం
-పట్టాలు తప్పిన సికింద్రాబాద్- ముంబై (కుర్లా) ఎల్టీటీ దురంతో ఎక్ప్ ప్రెస్ రైలు - ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు - సహాయక చర్యల్లో ఆలస్యం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కర్ణాటకలో శనివారం తెల్లవారుజామున రైలుప్రమాదం సంభవించింది. రాత్రి 11.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన సికింద్రాబాద్-ముంబై ఎల్టీటీ దురంతో ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ షాహబాద్ స్టేషన్ దాటిన తర్వాత తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మార్టూర్ వద్ద 9 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రగాయాలయినట్టు రైల్వే అధికారులు తెలిపారు.110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కుర్లా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే రైల్వే శాఖ సహాయక బృందాలు ప్రమాద స్థలికి పరుగుతీశాయి. అయితే అర్థరాత్రి చిమ్మచీకటి కావడంతో సహాయచర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శిథిలాల్లో ఇరుక్కుపోయినవారి ఆర్తనాదాలు, తమవారు ఎక్కడున్నారో తెలియక పలువురు ప్రయాణికులు రోదించడం అక్కడ కనిపించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా చెన్నై, ముంబై సికింద్రాబాద్ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రిస్క్యూ టీం, రైల్వే పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.