బెంగళూరు, మైసూర్, హుబ్లీ, గుల్బర్గా డివిజన్లను కలుపుతూ హుబ్లీ కేంద్రంగా 2003, ఏప్రిల్ 1న ఏర్పాటైన నైరుతి (సౌత్ వెస్ట్రన్) రైల్వే జోన్ భారీ ప్రమాదాల అడ్డాగా మారింది. శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్- ముంబై (కుర్లీ) ఎల్టీటీ దురంతో ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 12220) పట్టాలు తప్పిన మార్టూరు రైల్వే స్టేషన్ కూడా ఇదే జోన్ (గుల్బర్గా డివిజన్) పరిధిలోనే ఉంది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రైలు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రైలు అత్యధికంగా 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలదు. అంటే ప్రమాద సమయంలో సాధారణ వేగంతో ఉన్నట్టే లెక్క. ట్రాక్ ఏమైనా కొట్టుకుపోయిందా అంటే అలాంటి దాఖలాలేవీ కనిపించలేదు. మరి ప్రమాదం ఎలా జరిగినట్లు? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి లభించే సమాధానం.. నిర్లక్ష్యం ఒక్కటే. ట్రాక్ నిర్వహణపట్ల ఆ డివిజన్ అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు బలి కావడానికి కారణమయింది.
ఇదే జోన్ లో ఈ ఏడాది ఆగస్టు 24న కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లోని అనెకల్ రోడ్డు-హోసూరు వద్ద జరిగిన ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు- ఎర్నాకుళం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పటంతో ఆ ప్రమాదం జరిగింది. అయితే ఇంజన్లో మంటలు చెలరేగినందున సాకేతిక సమస్యలు తలెత్తాయని, అందుకే పట్టాలు తప్పాయని రైల్వే శాక అంతర్గత నివేదిక పేర్కొంది.
సహజంగా అన్ని జోన్లలో రైళ్లు పట్టాలు తప్పాయన్న వార్తలు ఎప్పుడూ వినేవే. కానీ నైరుతి జోన్ లో రైలు పట్టాలు తప్పిందంటే మాత్రం కచ్చితంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుండటం గమనార్హం. సాంకేతికతను విస్తరించడంలో నెలకొన్న ఆలస్యానికి తోడు, సిబ్బంది కొరత కూడా ఈ ప్రమాదాలకు ఇతర కారణాలుగా తెలుస్తున్నాయి. శనివారం నాటి ప్రమాదంలో మర్టూరు స్టేషన్ను పరిశీలిస్తే నైరుతి రైల్వే జోన్ ఎలాంటి దుస్థితిలో ఉన్నదో ఇట్టే అర్థమవుతుంది.