రైలు ప్రమాద బాధితులకు పరిహారం
న్యూఢిల్లీ: కర్ణాటకలోని గుర్బర్గాకు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో బాధితులకు రైల్వే శాఖ నష్టపరిహారం ప్రకటించింది. మృతి చెదిన ఎనిమిది మంది కుటుంబాలకు తలా రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి తలా రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన ఒక్కొక్కరికి రూ. 25 వేల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె. మిట్టల్ తెలిపారు.
ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. ఈ ఘోరం ఎలా జరిగిందనేదానిపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించినట్లు మిట్టల్ పేర్కొన్నారు. ఇందుకోసం రైల్వే సేఫ్టీ కమిషనర్ (సెంట్రల్ సర్కిల్) నేతృత్వంలో విచారణ బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపేశామని, మరమ్మతుల అనంతరం తిరిగి సేవలను పునరుద్ధరించామని, ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఏర్పడదని ఆయన చెప్పారు.