అల్–షబాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ
నైరోబి: సోమాలియాలో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్ర సంస్థ అల్–షబాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశంలోని ఓ శిబిరంపై దాడిచేసి 52 మంది అల్–షబాబా ఉగ్రవాదులను ముట్టుబెట్టామని కెన్యా సైన్యం శుక్రవారం ప్రకటించింది. దిగువ జుబ్బాలోని బదాదేలో ఉన్న ఈ శిబిరంపై తెల్లవారు జామున సైనికులు తుపాకులతో విరుచుకుపడ్డారని ఆర్మీ ప్రతినిధి కల్నర్ జోసెఫ్ తెలిపారు. అక్కడి నుంచి పలు రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
అయితే ఈ పరిణామంపై అల్–షబాబా ఎలాంటి ప్రకటన చేయలేదు. సోమాలియాలో ఇటీవల ఈ సంస్థ దాడులు తీవ్రతరం కావడంతో అధ్యక్షుడు అబ్దుల్లాహి మహ్మద్ దానిపై యుద్ధం ప్రకటించారు. 2011లో సోమాలియాకు కెన్యా తన సైనికులకు పంపించినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అల్–షబాబ్ ఆనాడే ప్రకటించింది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పలుమార్లు విజయం సాధించామని కెన్యా ప్రకటించినా, సోమాలియా ప్రజలు కొట్టిపారేశారు.