పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతం
వాషింగ్టన్: సొమాలియాలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా మిలటరీ శనివారం వైమానిక దాడులకు పాల్పడింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక సొమాలియాలో జరిగిన మొట్టమొదటి దాడి ఇది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు సొమాలియా ప్రభుత్వ సహకారంతో యూఎస్ ఆఫ్రికా కమాండ్ ఈ దాడులు చేపట్టిందని రక్షణ మంత్రి పీట్ హగ్సెత్ తెలిపారు.
వైమానిక దాడిలో పలువురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు రక్షణ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అయితే, పౌరులెవరికీ ఎలాంటి హాని కలగలేదని తెలిపింది. సీనియర్ ఐసిస్ నేతతోపాటు మరికొందరు లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సీనియర్ నేత కోసం అమెరికా చాలా ఏళ్లుగా గాలిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం మాత్రం ఇతడి అడ్డు తొలగించడంలో ఎంతో ఆలస్యం చేసిందని విమర్శించారు. ఆ పని తాము చేశామని ట్రంప్ ప్రకటించుకున్నారు.
తాజా దాడిలో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వారు దాక్కున్న గుహలు నామరూపాల్లేకుండాపోయాయని తెలిపారు. అయితే, ఈ దాడుల్లో సదరు ఐఎస్ నేత ఎవరు? అతడు హతమయ్యాడా లేదా? అనే విషయాలను ఆయన వెల్లడించలేదు. అమెరికన్లపై దాడులకు పాల్పడే ఐసిస్ తదితర గ్రూపులకు నా హెచ్చరిక ‘మీరెక్కడున్నా కనిపెట్టి, మట్టుబెడతాం’అని ఆయన ప్రకటించారు. సొమాలియా ఉత్తర ప్రాంతంలో దాక్కున్న ఐసిస్ నాయకత్వం విదేశీయులను కిడ్నాప్ చేయడం, డ్రోన్ల దృష్టిలో పడకుండా తప్పించుకోవడం, యుద్ధ తంత్రాలపై తమ శ్రేణులకు తర్పీదు నిస్తున్నాయని అమెరికా సైనికాధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment