Published
Sun, Nov 20 2016 1:53 PM
| Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
కేరింతలతో అంత్యక్రియలు..
చితికి నిప్పుపెట్టే సందర్భంలో ఎవరైనా హర్షధ్వానాలు చేస్తారా? కణకణమండే ఆ నిప్పుల్ని చూసి కిలకిలా నవ్వుతారా? చచ్చింది ఏ విలనో, విలనిజం తాలూకు గుర్తులో అయితే జనం అలా చేయడంలో తప్పేముంటుంది? తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో అదే జరిగింది. ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్న 5,250 అక్రమ ఆయుధాలను 15 అడుగుల ఎత్తులో వరుసగా ఏర్పాటుచేసిన దండాలకు కు చితిలా పేర్చి పెట్రోల్ కుమ్మరించి నిలువునా దహనం చేశారు. వందలాది మంది జనం కేరింతల మధ్య గత వారం నైరోబీలో కెన్యా ఉపాధ్యక్షుడు విలియం రూటో తుపాకులకు నిప్పుపెట్టారు.
అగ్నికి ఆహుతైన తుపాకుల్లో అధికశాతం ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినవేనని, ఇంకోన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నవని ఉపాధ్యక్షుడు చెప్పారు. తుపాకులను పేర్చి దహనం చేసిన దృశ్యాలను విలియం తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సోమాలియాలో విధ్వంసం సృష్టిస్తోన్న అల్-షబీబ్ ఉగ్రవాద సంస్థ కెన్యాలోనూ కాలు మోపే ప్రయత్నం చేస్తున్నదని, ఆ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తున్నదన్న విలియం..ఇకపై అలాంటిచర్యలను ఉపేక్షించబోమని ఉగ్రవాదులను హెచ్చరించారు. ఇప్పుడు కాల్చేసినవి కాకుండా కెన్యాలో మరో 5 లక్షల అక్రమ ఆయుధాలు ఉన్నట్లు, అతి త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుని తగలబెడతామని ఆయన అన్నారు.