'అమ్మాయిలు అబ్బాయిలు దూరం దూరం'
కొట్టాయం: కేరళ పాఠశాలలో ఓ విచిత్ర నిబంధన విధించారు. అమ్మాయిలు, అబ్బాయిలు పాఠశాల ప్రాంగణంలో కనీసం మీటర్ దూరం ఉండి వారి వారి పనులు చూసుకోవాలని ఆదేశించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం పట్ల స్కూల్ యాజమాన్యంపై పలువురు సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రముఖ సామాజిక వేత్త, రచయిత అరుంధతీ రాయ్ తల్లీ మేరీ రాయ్ కొట్టాయంలో స్థాపించిన పల్లి కూడమ్ పాఠశాలలో ఇలాంటి నిబంధనలు ఉండటం కూడా విమర్శలు వేగం అందుకోవడానికి కారణం అయింది.
సాధారణంగా పాఠశాలలో తరగతులవారిగా సెక్షన్లు ఉంటే ఈ పాఠశాలలో మాత్రం అమ్మాయిలవారిగా, అబ్బాయిల వారిగా సెక్షన్లు ఉన్నాయి. అయితే, ఇలా ఉండటం వల్ల వారిరువురి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని స్కూల్ యాజమాన్యం సమర్థించుకుంటోంది. దీంతోపాటు సీనియర్ విద్యార్థులు ఎవరూ జూనియర్లతో మాట్లాడకూడదని కూడా ఆంక్షలు విధించారట. అయితే, కొన్ని కార్యక్రమాల విషయాల్లో మాత్రం బాలబాలికలు ఉమ్మడిగా పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్ ను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.