పెళ్లిళ్ల ఖర్చు రూ.5 లక్షలే! | kerala to regulate marriage expenditure | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్ల ఖర్చు రూ.5 లక్షలే!

Published Thu, Jun 11 2015 8:07 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

పెళ్లిళ్ల ఖర్చు రూ.5 లక్షలే!

పెళ్లిళ్ల ఖర్చు రూ.5 లక్షలే!

తిరువనంతపురం: అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తూ అందుకు విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చులను నియంత్రించాలని కేరళ మహిళా కమిషన్ నిర్ణయించింది. ఓ పెళ్లికి ఖర్చు ఐదు లక్షల రూపాయలకు మించకూడదంటూ కొన్ని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పెళ్లి కూతురు నగల కోసం 80 గ్రాములకు మించి బంగారం కొనరాదని, పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్య 200లకు దాటకూడదని, పెళ్లి కూతురు దుస్తులపై పది వేలు, పెళ్లి కొడుకు దుస్తులపై ఐదువేల రూపాయలకు మించి ఖర్చు చేయరాదని, పెళ్లి వేదికకు పాతిక వేలకు మించి ఖర్చు చేయరాదని, భోజనానికి ప్లేటుకు వంద రూపాయలు మించరాదంటూ ప్రతిపాదనలు చేసింది.

రాష్ట్రంలో ఎవరైనా పెళ్లి కోసం మొత్తంగా ఐదు లక్షల రూపాయలకు మించి ఖర్చుచేస్తే, ఆ చేసిన దానిపై 25 శాతం జరిమానా విధించాలని, తద్వారా వచ్చిన సొమ్మును పేద పిల్లల పెళ్లిళ్లకు ఖర్చు చేయాలని కూడా మహిళా కమిషన్ సూచించింది. ధనవంతులు తమ వైభవాన్ని చాటుకోవడానికి పెళ్లిళ్ల పేరిట చేస్తున్న ఖర్చులు మధ్యతరగతి, పేదల పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తున్నాయని, వైభవంగా పెళ్లి చేయడం కోసం ఇల్లు అమ్ముకున్న కుటుంబాల గురించి కూడా తనకు తెలుసునని, అందుకే ఇలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కేసి రోసకుట్టి చెప్పారు. ఆమె ప్యానెల్ చేసిన ఈ ప్రతిపాదనలు దేశంలోనే కాకుండా ఎన్నారైల్లో కూడా పెద్ద చ ర్చకు దారితీశాయి.

దేశంలో బంగారు నగలు కాకుండా పెళ్లిళ్లపై ఏడాదికి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ కావడం విశేషం. దేశంలో ప్రతి ఏడాది జరుగుతున్న బంగారం కొనుగోళ్లలో కేరళ వాటా 20 శాతం. అందులో 75 శాతాన్ని పెళ్లిళ్ల కోసమే కొనుగోలు చేస్తోంది. తన కై్లంట్ ఒక్కొక్కరు ఒక్కో పెళ్లిపై నగలు, దుస్తులు కాకుండా సగటున యాభై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కోచిలోని ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ తెలియజేసింది. ఈ సరికొత్త ప్రతిపాదనలపై వ్యాపారస్థులు, సామాజిక కార్యకర్తలు పరస్పరం భిన్నంగా స్పందించారు. పెళ్లిళ్ల పరిశ్రమను నమ్ముకొని వ్యాపారస్థులే కాకుండా కొన్ని వేల మంది ఉద్యోగులు బతుకుతున్నారని, ఇప్పుడు ఆంక్షలు విధిస్తే వారంతా వీధుల్లో పడతారని వ్యాపారస్థులు చెబుతున్నారు.

బట్టల షాపులు, నగల షాపులు ప్రధానంగా పెళ్లిళ్ల కోసమే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయని, మహిళా కమిషన్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే వారంతా తమ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ సామాజిక కార్యకర్తలు మాత్రం పెళ్లిళ్ల పేరిట వృధాగా చేస్తున్న ఖర్చును ఆంక్షల ద్వారా అరికట్టవచ్చని చెబుతున్నారు. చట్టపరంగా ఆంక్షలు తీసుకొస్తే ఫలితం ఉండదని, పెళ్లి అనేది సంస్కృతితో ముడిపడిన కార్యక్రమం అవడం వల్ల ప్రజల్లో సామాజిక స్పృహను తీసుకరావడమే పరిష్కారమని దుబాయ్‌లో పనిచేస్తున్న బిజినెస్ జర్నలిస్ట్ కే రవీంద్రన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement