
చిన్నారి జనహిత క్షేమం
హైదరాబాద్: చిన్నారి జనహిత కిడ్నాప్ సుఖాంతమైంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేయలేదని, క్షేమంగా ఉందని పోలీసులు గుర్తించారు. బాచుపల్లిలో ఈ ఉదయం స్కూలుకు వెళుతున్న జనహితను గుర్తు తెలియని మహిళ కారులో కిడ్నాప్ చేసిందని పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాప ఆచూకీ కనిపెట్టారు.
జనహితను ఎవరు అపహరించలేదని, ఆమె మరో స్కూలు వ్యానులో వెళ్లడం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని తేల్చారు. సమాచార లోపం వల్లే ఇదంతా జరిగిందని గుర్తించారు. తమ పాప క్షేమంగా ఉందని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల భద్రత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.