Girl kidnapped
-
మడకశిరలో బాలిక కిడ్నాప్
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలోని బేగార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మడకశిర పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల ఐదో తేదీ ఉదయాన్నే కళాశాలకని ఇంటి నుంచి బయల్దేరింది. రాత్రి వరకు ఎదురుచూసినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికారు. బంధువుల ఇళ్లకేమైనా వెళ్లిందేమోనని ఆరా తీశారు. అయినా ఆచూకీ దొరకలేదు.మరుసటిరోజు శుక్రవారం మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడ్రోజులు గడిచినా పోలీసులు బాలిక ఆచూకీని గుర్తించలేదు. దీంతో బాలిక తల్లి శైలజ తీవ్ర మనోవేదనకు గురై సోమవారం ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను మడకశిర ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి జయరామప్ప కూడా పోలీస్‌స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బంధువులు, కుటుంబసభ్యులు ఆయన్ను వారించడంతో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న సీఐ రాజ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో చర్చించారు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని సీఐతో వారు వాగ్వాదానికి దిగారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుని బాలికను క్షేమంగా అప్పగిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... 31 ఏళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు: పదమూడేళ్ల బాలికను కిడ్నాప్‌చేసి ఆపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 31 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోని కాంచీపాడి గ్రామానికి చెందిన ఢిల్లీబాబు(30)పై వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు, కిడ్నాప్, స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఇతను తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న అదే గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను 2019లో కిడ్నాప్ చేశాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు ఢిల్లీబాబు బాలికను కిడ్నాప్ చేసి పూందమల్లిలోని ప్రైవేటు లాడ్జీలో ఉంచి 10 రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణ తిరువళ్లూరు జిల్లా కోర్టులో సాగింది. విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తి సుభద్రదేవి తుది తీర్పు వెలువరించారు. బాలికను కిడ్నాప్ చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష, అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, బాలికను నిర్బంధించినందుకు మరో ఏడాది జైలుశిక్ష విధించారు. కాగా తీర్పు అనంతరం నిందితుడిని పోలీసులు పుళల్ జైలుకు తరలించారు. -
మూడపల్లిలో యువతి కిడ్నాప్
-
సినిమా స్టైల్లో.. షాకింగ్ విషయాన్ని చెప్పిన ఇంటర్ విద్యార్థిని.. కంగుతిన్న పోలీసులు
పెదపూడి(కాకినాడ జిల్లా): జి.మామిడాడలో తమ బాలిక కిడ్నాప్‌కు గురైందని ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడంతో పోలీసులు బాలికను పట్టుకున్న ఉదంతమిది. పెదపూడి ఎస్ఐ పి.వాసు తెలిపిన వివరాల ప్రకారం జి.మామిడాడకు చెందిన ఓ బాలిక ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం 10 గంటలకు బాలిక రాలేదంటూ కళాశాల యాజమాన్యం ఫోన్ చేయడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. చదవండి: వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసులకు దొరికేసిన ఐదు జంటలు సెల్ లొకేషన్ ఆధారంగా బాలిక రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్నారని నిర్ధారించుకున్నారు. బాలికతో పాటు ఆమెను తీసుకెళుతున్న యువకుడిని సైతం పట్టుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమైన తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన ఒక యువకుడిని ప్రేమిస్తున్నట్లు, పెళ్లి చేసుకోవడానికి అతడితో వెళ్లినట్లు బాలిక చెప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బందరులో బాలిక కిడ్నాప్ కలకలం
కోనేరుసెంటర్ (మచిలీపట్నం): బందరులో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న బాలికను ఓ గుర్తు తెలియని యువకుడు స్కూటీపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. చిన్నారి గట్టిగా ఏడుపులంకించుకోవడంతో మరోచోట వదిలేసి పరారయ్యాడు. అనంతరం ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆందోళన నెలకొంది. సేకరించిన వివరాల మేరకు.. మచిలీపట్నం సుకర్లాబాదుకు చెందిన జంపాన చంద్రశేఖర్, లక్ష్మీబేబి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె పదో తరగతి చదువుతోంది. రెండో కుమార్తె రమ్యశ్రీ ఐదో తరగతి చదువుతోంది. చంద్రశేఖర్ ఇంటికి సమీపంలో టీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి రమ్యశ్రీ టీ దుకాణం సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. ఇంతలో గుర్తు తెలియని ఓ యువకుడు స్కూటీపై రమ్యశ్రీ వద్దకు వచ్చి.. ఓ అడ్రస్ అడుగుతూ బాలికను బైక్‌పై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి పలు మార్గాల్లో జిల్లా కోర్టు సెంటర్ వరకు తీసుకెళ్లాడు. బాలిక గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టేసరికి ఆమెను స్థానిక వినాయకుడి గుడి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి బాలిక నడుచుకుంటూ ఇంటికి చేరింది. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందటంతో సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బందరు డీఎస్పీ ఎం.రమేష్‌రెడ్డి, సీఐ అంకబాబు ఘటన వివరాలు సేకరించారు. కాగా, ఈ ఘటనపై సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు. చదవండి: పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు ఏబీవీ అక్రమాలపై విచారణ తుది దశకు -
మిస్టరీగా బాలుడు, బాలిక అదృశ్యం
సాక్షి, కొత్తూరు(శ్రీకాకుళం) : మండల కేంద్రం కొత్తూరుకు చెందిన అరేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ కేసును పోలీసులు సవాల్ తీసుకున్నారు. కొత్తూరుకు చెందిన కొట్నాల భవాని(బాలిక) చిన్నప్పుడే అమ్మను కోల్పోవడంతో తండ్రి మరో వివాహం చేసుకోని వేరే గ్రామం వెళ్లిపోయాడు. అదే గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర భవాని ఉంటుంది. జూన్ 26న పాలకొండలో తన స్నేహితురాలి వివాహం ఉందని చెప్పి సొండి తమన్‌ను (వరసకు మామయ్య కుమారుడు) తనతోపాటు తీసుకుని వెళ్లింది. తిరిగి ఇంటికి చేరకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో బాలుడి తల్లిదండ్రులు వెతికారు. ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీసులకు సోమవారం బాలుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేశారు. పాలకొండ డీఎస్పీ ప్రేమ్ కాజిల్, ఇన్చార్జి సీఐ రవిప్రసాద్ మంగళవారం ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేశారు. బాలుడు తల్లిదండ్రులు, బాలిక అమ్మమ్మను, భవానీ స్నేహుతురాలను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. భవాని తీసుకువెల్లిన ఫోన్ సిగ్నల్స్ హైదరబాద్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో కొత్తూరు నుంచి రెండు బృందాలు మంగళవారం బయలుదేరి వెళ్లాయి. తమన్ తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తల్లి కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. పక్క వీధిలో ఉన్న భవాని ఇంటి వద్దకు తమన్ నిత్యం వస్తుంటాడు. బాలుడిని తీసుకుపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. భవాని బంధువు కావడంతో నమ్మి పంపిస్తే ఇలా జరిగిందని తల్లడిల్లుతున్నారు. బాలుడుని భవాని తీసుకువెళ్లడానికి కారణాలు తెలియకపోవడంతో ప్రాణాలతో రావాలని కోరుకుంటున్నారు. ఫోన్ చేస్తుంటే కట్ చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మిస్టరీ స్థానికంగా సంచలనం రేపింది. బాలుడు తమన్ కొత్తూరులోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. భవాని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8 తరగతి చదువుతుంది. -
తెలిసిన వ్యక్తే.. కిడ్నాపర్
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలో చిన్నారి మనీశ్వరి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కేరళ రాష్ట్రంలోని త్రివేండంలోని పోలీసుల అదుపులో ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. చిన్నారి కోసం తల్లిదండ్రులు, పోలీసులు త్రివేండం వెళ్లనున్నారు. గీతా కాన్వెంట్ హైస్కూల్లో ఎల్కేజీ చదువుతున్న మనీశ్వరి శుక్రవారం రోజున అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఓ మహిళ వచ్చి పాపను తీసుకెళ్లిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. పాప తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. సీసీటీవీలో రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు రజితగా గుర్తించారు. చిన్నారి కుటుంబానికి నిందితురాలు రజిత తెలిసిన వ్యక్తిగా గుర్తించారు. -
ప్రియుడిపై కోపంతో బాలిక కిడ్నాప్
నందిపేట(ఆర్మూర్): వివాహేతర సంబంధం ఆరేళ్ల బాలికను కిడ్నాప్‌నకు చేసేలా చేసింది. తనతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్న వ్యక్తి తన మాటలు విన డం లేదని గొడవ పడిన యువతి అతడి బిడ్డను కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నింది. పాఠశాలకు వెళ్లి చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన సంఘటన నందిపేటలో గురువారం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన బాలి క తల్లి, పోలిసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య తగాదాలు మండలంలోని వన్నెల్ కే గ్రామానికి చెందిన మద్ది రమేష్, హరిత దంపతులకు ఆరేళ్ల కూతురు మనీశ్వరీ, ఏడాది వయస్సున్న కూతురు అహల్య ఉ న్నారు. మనీశ్వరీ నందిపేటలోని శ్రీగీతా హైస్కూల్లో యూకేజీ చదువుతుంది. మద్ది రమేష్ వన్నెల్ కే గ్రామానికి పక్కనే గల ఆర్మూర్ మండలం మ చ్చర్లలో మీసేవ కేంద్రం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత కాలంగా మచ్చర్లలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలితో పరిచయం ఏర్పడింది. క్రమేణ వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరికి కూడా ఓ కూతురు జన్మించింది. అయితే కొన్ని రోజులుగా వీరిద్దరితో పాటు రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. దీంతో కోపంతో యువతి, రమేశ్ దంపతుల కూతురును కిడ్నాప్ చేసేందుకు నిర్ణయించింది. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి.. మండల కేంద్రంలోని శ్రీగీతా హైస్కూల్లో చదువున్న మనీశ్వరీని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్లి పాఠశాలలో ఏవైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయా అని ఆరా తీసింది. ఖాళీలు లేవని యాజమాన్యం చెప్పడంతో వెనుదిరిగి వెళ్తూ పాప గురించి ఆరా తీసింది. ఆ రోజు పాప పాఠశాలకు రాలేదని తెలియడంతో వెళ్లిపోయింది. తిరిగి గురువారం మళ్లీ పాఠశాలకు వచ్చి పాప గురించి ఆరా తీయగా గమనించిన పాఠశాల సిబ్బంది ఖాళీలు లేవని మళ్లీ ఎందుకు వచ్చావని సదరు యువతిని ప్రశ్నించారు. మనీశ్వరీ తన బంధువుల అమ్మాయి అని చెప్పి తనతో పంపిచాలని కోరడంతో పంపించ డం కుదరదని చెప్పినా అక్కడే ఉండి, మధ్యా హ్నం లంచ్ సమయంలో మనీశ్వరీ చేతులు కడుక్కునేందుకు బయటకు రాగా పాపను పక్కకు పిలిచి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఎక్కించుకుని పరారైంది. దీంతో పాఠశాల యాజమాన్యం గుర్తించి వెంటనే పాప తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు పాపను తీసుకెళ్లిన యువతి గురించి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల వెతికిన ఫలితం లేదు. గురువారం సాయంత్రం పాప తల్లి హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పాప ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ సంతోషకుమార్ తెలిపారు. పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
అపహరణకు గురైన చిన్నారి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని నందిపేట్ మండల కేంద్రంలో ఓ పాప అపహరణకు గురైంది. ప్రైవేట్ పాఠశాల నుంచి ఓ మహిళ వచ్చి ఆ పాపను తీసుకెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపింది. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూల్ సిబ్బందిని విచారించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ ఏవరో తెలియదని, ఆమె వచ్చి పాపను తీసుకెళ్లిందని సిబ్బంది తెలపగా.. ఆ గుర్తు తెలియని మహిళ ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రేమిస్తున్నట్లు నటించి.. బాలిక కిడ్నాప్
సాక్షి, బనశంకరి : ప్రేమిస్తున్నట్లు నటించి ఓ యువకుడు, మైనర్ బాలికను కిడ్నాప్‌నకు పాల్పడిన ఘటనపై హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం పదేళ్ల క్రితం నగరానికి చేరుకుని దణిసంద్రలో నివాసముంటోంది. వీరి కుటుంబంలో పదేళ్ల వయసున్ను ఓ బాలిక ఇక్కడి హెణ్ణూరులో 7వ తరగతి చదువుతోంది. బాలిక తండ్రి అపార్టుమెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. వీరి ఇంటి ఎదురుగా ఉంటున్న వినోద్ అనే యువకుడు బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వినోద్‌ను హెచ్చరించారు. ఈనెల 2న బాలికను తీసుకుని వినోద్ ఉడాయించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరి కోసం గాలిస్తున్నారు. -
కిడ్నాప్ చేసిన యువకుడిపై ‘నిర్భయ’
గార్ల(డోర్నకల్): ఇంటర్ చదువుతున్న ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్న ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదైన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పోచారం పంచాయతీ ఒండిగుడిసెతండాకు చెందిన భూక్య నరేష్, ఇంటర్ చదువుతున్న ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి గత సెప్టెంబర్ 6న కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. కాగా తమ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ బాలిక తల్లిదండ్రులు సెప్టెంబర్ 16న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం గార్ల రైల్వేస్టేషన్లో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో నిందితుడు భూక్య నరేష్ పోలీసులకు తారసపడ్డాడు. ఈమేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇల్లందు కోర్టుకు తరలించినట్లు బయ్యారం ఇన్చార్జ్ సీఐ ఎ.రాజయ్య, ఎస్సై.సీహెచ్ వంశీధర్ తెలిపారు. మైనర్ కావడంతో అమ్మాయిని తల్లితండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నరేష్‌పై నిర్భయ, ఫోక్స్‌యాక్ట్ కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి అరెస్టును చూపుతున్న ఇన్చార్జి సీఐ రాజయ్య -
చిన్నారి జనహిత క్షేమం
హైదరాబాద్: చిన్నారి జనహిత కిడ్నాప్ సుఖాంతమైంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేయలేదని, క్షేమంగా ఉందని పోలీసులు గుర్తించారు. బాచుపల్లిలో ఈ ఉదయం స్కూలుకు వెళుతున్న జనహితను గుర్తు తెలియని మహిళ కారులో కిడ్నాప్ చేసిందని పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాప ఆచూకీ కనిపెట్టారు. జనహితను ఎవరు అపహరించలేదని, ఆమె మరో స్కూలు వ్యానులో వెళ్లడం వల్లనే ఈ గందరగోళం తలెత్తిందని తేల్చారు. సమాచార లోపం వల్లే ఇదంతా జరిగిందని గుర్తించారు. తమ పాప క్షేమంగా ఉందని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల భద్రత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు తల్లిదండ్రులు కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. -
పిల్లలతో గడపండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తల్లిదండ్రులు తమ బిడ్డల చదువులు, భవిష్యత్తు కోసం డబ్బులు కాదు తగినంత సమయాన్ని ఖర్చు చేయండి, లేకుంటే మాధ్యమాల ప్రభావంలో పడి బతుకును బుగ్గి చేసుకోగలరు జాగ్రత్త’. చెడుదారి పట్టుతున్న నేటి తరం పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఈ హితవు మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి. వివరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా తిట్టకుడి పెరుమలై గ్రామం పుదుకాలనీకి చెందిన ప్రకాష్ (22)ను బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ఈ ఏడాది జూలై 7వ తేదీన అరెస్ట్ చేశారు. 84 రోజుల పాటు జైల్లోఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిందితుడు ప్రకాష్ 17 ఏళ్ల బాలికను ప్రేమించి, కిడ్నాప్ చేయడంతోపాటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించాడు. పిటిషనర్ ప్రకాష్ చాలా అమాయకుడని, ఆ బాలికే అతనిపై ఒత్తిడి తెచ్చి పరారైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించాడు. ఇరుతరఫు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి వైద్యనాథన్ పిటిషనర్ ప్రకాష్‌కు గురువారం బెయిల్ మంజూరు చే శారు. ఈ సందర్భంగా పెద్దలు, తల్లిదండ్రులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి సంబంధం చూడడంతో తానే ప్రకాష్‌తో వెళ్లానని బాధిత యువతి తన వాంగ్మూలంలో తెలిపింది. తనను ఇంటి నుంచి తీసుకెళ్లకుంటే విషం మింగి ఆత్మహత్య చేసుకుంటానని అతడిని బెదిరించింది. తన ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా పెద్దలే తన వివాహాన్ని నిర్ణయించారని ఆ యువతి తెలిపింది. అందుకే ప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశాను’ అని న్యాయమూర్తి తెలిపారు. ఇద్దరి నుంచి రూ.10వేల పూజీ కత్తు చెల్లించి బెయిల్ ఆదేశాలు పొందవచ్చని, అలాగే ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసు స్టేషన్లో సంతకం చేయాలని, విచారణకు పిలిచినపుడు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి తెలిపారు. అంతేగాక ఈ కేసులో సాక్షులను, ఆధారాలను రూపుమాపే ప్రయత్నాలు చేయరాదని, అజ్ఞాతంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఈ నిబంధనలు మీరితే కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసేముందు పెద్దలకు కొన్ని విషయాలు చెప్పదలిచానని న్యాయమూర్తి వైద్యనాధన్ అన్నారు. పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చుచేసే కంటే వారి భవిష్యత్తు కోసం కొంత కాలాన్ని ఖర్చుచేయడం ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తించాలని హితవు పలికారు. లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలున్నా 12 నుంచి17 వయస్సు బాలికలు తమకు నచ్చిన యువకులతో ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడుతున్నారని అన్నారు. దీని వల్ల బాలికలు మాత్రమే కాదు వారితోపాటూ వెళ్లిపోయే బాలురు, యువకులు సైతం బాధితులుగా మిగిలిపోతున్నారని, న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలకు సులభంగా అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాలే కారణమని ఆయన అన్నారు. సినిమాల్లో టీనేజ్ అమ్మాయితో టీనేజ్ అబ్బాయి వెంట పడడం నిజజీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నారని తెలిపారు. సినిమాల్లో మంచి చెడు విశ్లేషించుకోలేని పిల్లలు తప్పుదారిన పడి బలి అవుతున్నారని చెప్పారు. పిల్లలతో పెద్దలు చనువుగా మెలిగి చేరదీసినపుడే వారిలో విచక్షణాజ్ఞానం పెరుగుతుందని అన్నారు. అంతేగాక తల్లిదండ్రుల వద్ద ఏదీ దాచకూడదనే అభిప్రాయం కలుగుతుందని న్యాయమూర్తి చెప్పారు. -
రైల్వే స్టేషన్లో కిడ్నాప్ కలకలం
-
వర్ధమాన సినీ సంగీత దర్శకుడి అరెస్ట్
తణుకు (పశ్చిమగోదావరి జిల్లా) : సినిమాల్లో సింగర్‌గా ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఒక బాలికను కిడ్నాప్ చేశాడన్న అభియోగంపై హైదరాబాద్‌కు చెందిన వర్థమాన సినీ సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ అలియాస్ షేక్ సయ్యద్ హుస్సేన్ ఆలీని తణుకు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ రాజులపాటి అంకబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన సాకేత్ సాయిరామ్ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా ఎదుగుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆయన ఈ ఏడాది మే 22న ఉండ్రాజవరం మండలం పాలంగిలో జరిగిన తన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. సాయిరామ్ మరో మిత్రుడి కుమార్తె అయిన సుమారు 15 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా సాకేత్ సాయిరామ్ తనవెంట హైదరాబాద్ తీసుకుపోయాడు. బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇళ్లతోపాటు సమీప ప్రాంతాల్లో వాకబు చేశారు. బాలిక ఆచూకీ దొరక్కపోవడంతో ఉండ్రాజవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై బి.శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ బాలిక కాట్రేనికోనలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు చేరింది. అయితే మరోసారి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన గ్రామానికి వచ్చిన సాయిరామ్ ఆ బాలికను మరోసారి తన వెంట తీసికెళ్లిపోయాడు. హైదరాబాద్‌లోని ఒక లాడ్జిలో ఆమెను కొన్నాళ్లు నిర్బంధించి అనంతరం సాయిరామ్ మిత్రుడు కిరణ్ ఇంట్లో సైతం కొన్ని రోజులు దాచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఉండ్రాజవరం పోలీసులు సాయిరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను కిడ్నాప్ చేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకోవడంతో బాలికను అతని చెరనుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సాయిరామ్‌ను బుధవారం సీఐ అంకబాబు కోర్టులో హాజరుపరచగా 15 రోజులపాటు రిమాండ్ విధించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై బి.శ్రీనివాస్, ఏఎస్సై జయకృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, ఎంవీఎస్ఎస్కే మూర్తి, ప్రసాద్, కృష్ణమూర్తి, రామారావును కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు అభినందించారు. తమ్మారెడ్డి భరధ్వాజ శిష్యుడిగా చెప్పుకుంటున్న సాకేత్ సాయిరామ్ ఇప్పటివరకు వివిధ భాషల్లో 17 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2008లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన 1940లో ఒకగ్రామం’ చిత్రానికి జాతీయస్థాయి పురస్కారం అందుకున్నాడు. సాకేత్ ఎంతో మందిని ఇలా నమ్మించి మోసం చేయడంతోపాటు యువతులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. -
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
రూ. 2.25 లక్షల జరిమానా విజయవాడ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.2,25,000 జరిమానా విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి కం ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఎ.గిరిధర్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన నిందితుడు బొజ్జా సురేష్ తన కుటుంబంతో నివశిస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య ఇద్దరి పిల్లలను భర్తను వదలి వెళ్లిపోయింది. అదే ప్రాంతంలో నివశిస్తున్న దూరపు బంధువైన మైనర్ బాలికపై నిందితుని కన్ను పడింది.ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి 2013,ఆగష్టు 18న నాగపట్నం వెళ్లి వద్దామని చెప్పాడు. మరుసటి రోజు ఇద్దరు కలసి చెన్నై వె ళ్లారు.అక్కడ నుంచి నాగపట్నం చేరారు. అక్కడే బాలికను నిందితుడు వివాహం చేసుకున్నాడు. 15 రోజుల పాటు అక్కడే ఉంచి ఆ బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరానికి చేరుకున్న బాలిక విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బెల్లపు సత్య నారాయణ 11 మంది సాక్షులను విచారించారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కిడ్నాప్‌నకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా, లైంగిక దాడికి పదేళ్ల జైలుశిక్ష తోపాటు, రూ. 2 లక్షలు జరిమానా విధిస్తూ,శిక్ష ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. -
కిడ్నాపైన బాలిక సురక్షితం
గుంటూరు సిటీ : ఇటీవల హైదరాబాద్ హైకోర్టు వద్ద కిడ్నాపైన మౌనిక ఆచూకీ బుధవారం లభ్యమైంది. జిల్లాలోని అరండాల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురవయ్య హైస్కూల్ వెనక ఉన్న ఒక గుడిసెలో పాపను దాచాడు. పోలీసులు సీసీటీవీ పుటేజీల ద్వారా నిందితుడ్ని గుర్తించారు. అతని కదలికలను నిఘా ఉంచి పట్టుకున్నారు. నిందితుడు గుంటూరుకు చెందిన హనుమంతరావుగా గుర్తించారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
బాలిక కిడ్నాప్.. విడుదల
నల్లజర్ల రూరల్ :రాజమండ్రికి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు నల్లజర్ల మండ లం ప్రకాశరావుపాలెం వద్ద వదలి వెళ్లిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అనంతపల్లి ఎస్సై ఆకుల రఘు తెలిపిన వివరాల ప్రకారం... రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్‌లోని శ్రీహర్షవర్ధన ఇంగ్లిష్ మీడియం స్కూల్లో నర్సరీ చదువుతున్న పందిరి మోహన కృష్ణశ్రీ అలియూస్ మేఘన (4) బుధవారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైంది. సాయంత్రం 4.30 గంటల సమయంలో మేఘనను ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లి శ్రీదేవి కాన్వెంట్కు చేరుకోగా, అప్పటికే బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు తాము మేఘన మేనమావలమని చెప్పి బాలికను ఎత్తుకుపోయూరు. సాయంత్రం బాలిక తండ్రికి ఫోన్‌చేసిన దుండగులు రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. సొమ్మును గౌతమి ఘాట్ వద్దకు తీసుకురావాలని, పోలీసులకు చెబితే పిల్లను చంపేస్తామని బెదిరించారు. ఆ తల్లిదండ్రులు సాహసించి పోలీసులను ఆశ్రయించారు. విషయం వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో తమ పన్నాగం బట్టబయలయ్యే ప్రమాదం ఉందని భావించిన కిడ్నాపర్లు బాలికను తాడేపల్లిగూడెం-నల్లజర్ల రహదారిలో ప్రకాశరావుపాలెం హైస్కూల్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఇదే విషయూన్ని వారి తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పగా, వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతపల్లి ఎస్సై రఘు అక్కడికి వెళ్లి బాలి కను తీసుకొచ్చారు. బాలిక తల్లి శ్రీదేవిది నల్లజర్ల మండలం శింగరాజుపాలెం. ఆమె అక్క నవరాగిణి నల్లజర్లలోని ఓ షాపులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తెలుసున్న వ్యక్తులే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. బాలిక తండ్రి సాంబశివమూర్తి సీతానగరంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. -
తుపాకీతో బెదిరించి బాలికపై అత్యాచారం
ముజఫర్‌నగర్: ఇంటి దగ్గరి నుంచి ఒక బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ముగ్గురు కామాంధులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖేరి ఫిరోజాబాద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలికను శనివారం ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి, సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన అనంతరం బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బాలిక కిడ్నాప్‌నకు విఫలయత్నం
వింజమూరు, న్యూస్‌లైన్ : ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు నలుగురు విఫలయత్నం చేసిన సంఘటన మండలంలోని వింజమూరు-చాకలికొండ రోడ్డు మార్గంలో శనివారం చోటు చేసుకుంది. మరో బాలిక కిడ్నాప్‌నకు గురైనట్టు తెలుస్తోంది. బాధితురాలి కథనం మేరకు..మండలంలోని బత్తినవారిపల్లికి చెందిన కనియంపాటి యమున వింజమూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. రోజు మాదిరిగానే ఆటోలో పాఠశాలకు వెళ్లేందుకు బత్తినవారిపల్లిలో వేచి ఉండగా ఇంతలో ఒక ఆటో రావడంతో ఆ బాలిక అందులో ఎక్కింది. ఆటోలో ఓ మహిళ, ముగ్గురు యువకులు ఉన్నారు. వారి మధ్యలో మరొక బాలికకు ముసుగు వేసి ఉంది. అయితే కాళ్లు మాత్రం కనిపిస్తున్నాయి. పరిస్థితిని యమున గమనించి అనుమానించింది. ఇదే సమయంలో యమునను కూడా అందులోని వారు చాక్లెట్టు తినమని కోరగా తిరస్కరించింది. తినమని బలవంత పెట్టారు. యమున ప్రతిఘటించడంతో మాధవనగర్ సమీపంలో వదిలి వెళ్లారు. బాలిక జరిగిన ఉదంతాన్ని మాధవనగర్‌లోని స్థానికులకు తెలపగా వారు మరో ఆటోలో పాఠశాలకు పంపారు. అయితే ఇదే ఆటోలోని మరో బాలిక కిడ్నాప్‌కు గురైట్టు అనుమానం తలెత్తింది. ఆ బాలిక ఎవరనేది తెలియరాలేదు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. -
సింగ ర్ను చేస్తానని బాలిక కిడ్నాప్
=దుబాయ్‌కి అక్రమ రవాణా చేసేందుకు యత్నం = విమానాశ్రయంలో ఉద్యోగాలంటూ మోసాలు = నిందితుడు యూసుఫ్‌ను అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: ‘కేరళ సినీ రంగంలో సింగర్‌ని చేస్తా.. బ్యూటీషియన్‌ను చేసి నీ పేరు మారుమోగేలా చేస్తా’.. అంటూ యూసుఫ్ అనే వ్యక్తి నగరానికి చెందిన బాలికను కిడ్నాప్ చేశాడు. కేరళకు తీసుకెళ్లిన అతను అక్కడి నుంచి బాలికను దుబాయ్ పంపే ప్రయత్నాల్లో ఉండగా హుమాయున్‌నగర్ పోలీ సులు వెళ్లినిందితుడి అరెస్టు చేసి.. బాలికను కాపాడారు. ఈ కిడ్నాపర్ మాయమాటలతో కొందరికి ఆర్థికంగానూ టోకరా వేశాడని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు తెలిపారు. మైనర్ బాలికను ఆమె ఇష్టపూర్వకంగా తీసుకుపోయినా అది అపహరణే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. మాయమాటలతో నమ్మించి... చెన్నైలోని పప్పల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముస్తాఫా అలియాస్ యూసుఫ్ రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఫెరోజ్ గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. తాను ఇతర దేశాల నుంచి వివిధ వస్తువుల్ని దిగుమతి చేసి విక్రయిస్తుంటానని ఇంటి యజమానికి చెప్పాడు. ఇరుగు పొరుగుతోనూ పరిచయాలు పెంచుకున్న ముస్తాఫా యజమాని కుమార్తె (14)పై కన్నేశాడు. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించి ఆమెతో మాటకలిపాడు. తనకు కేరళ సినీ రంగానికి చెందిన అనేక మందితో పరిచయాలున్నాయని నమ్మించాడు. తనతో వస్తే గాయనిని చేస్తానని, సినీ రంగంలో బ్యూటీషియన్గానూ పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు కల్పిస్తానని వలవేసి ఈనెల 11న తనతో ఆమెను తీసుకుపోయాడు. బోగస్ ఓటర్ ఐడీ తయారీ... ఇతడి మాటల గారడీలో పడిన బాలిక తన ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్లిపోయింది. యూసుఫ్ ఆమెను కేరళలోని అలెప్పీలో ఉన్న తన స్నేహితుడు పీఏ హషీమ్ (ఆటోడ్రైవర్) ఇంట్లో ఉంచాడు. బాలికను దుబాయ్‌కి అక్రమ రవాణా చేయాలని పథకం వేసిన ఇతను ఆమెకు పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు అవసరమైన ధ్రువీకరణలు సమకూర్చుకొనేందుకు ఆ బాలిక వయస్సు 18 ఏళ్ల నిండినట్లు చూపిస్తూ, నకిలీ పేరు, బోగస్ వివరాలతో అలెప్పీలోనే ఓటర్ ఐడీ తయారు చేయించాడు. ఓడలో సుదూర ప్రయాణం చేయిస్తానంటూ బాలికను మభ్యపెడుతూ వచ్చాడు. ఈలోపు బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హుమాయున్‌నగర్ పోలీసులు.. యూసుఫ్ అలెప్పీలో ఉన్నట్టు కనిపెట్టారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసి బాలికను కాపాడింది. దర్యాప్తులో మోసాలు వెలుగులోకి... యూసుఫ్ వ్యవహారాలపై దర్యాప్తు చేసిన పోలీసులు అతడు వేరే మోసాలకూ పాల్పడినట్టు గుర్తించారు. తనకు రావాల్సిన సరుకు విమానాశ్రయంలో ఆగిపోయిందని, కొంత నగదు చెల్లించాల్సి ఉందని పలువురిని నమ్మించి డబ్బు వసూలు చేశాడని తేలింది. అలాగే సయ్యద్ మిరాజుద్దీన్ అనే వ్యక్తికి ఉద్యోగం పేరుతో ఎరవేశాడు. తనకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పని చేసే ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని నమ్మబలికాడు. మిరాజుద్దీన్ కుమారుడికి విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.4.5 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. హుమాయున్‌నగర్‌కు చెందిన బంగారం వ్యాపారి రామేశ్వర్లాల్తో పరిచయం పెంచుకున్న యూసుఫ్.. తన భార్యకు నాలుగు బంగారు ఉంగరాలు కావాలని వాటిని తీసుకున్న యూసుఫ్ భార్యకు చూపించి వచ్చి నగదు ఇస్తానంటూ ఉడాయించాడు. ఇతడిపై ఈ రెండు కేసులూ కూడా నమోదయ్యాయి. కేరళ, తమిళనాడులకు వేలిముద్రలు... యూసుఫ్ వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి గత చరిత్రను తెలుసుకొనేందుకు అతని వేలిముద్రల్ని కేరళ, తమిళనాడుల్లో ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలకు పంపుతున్నామన్నారు. తదుపరి విచారణ కోసం న్యాయస్థానం అనుమతిలో యూసుఫ్‌ను కస్టడీలోకి తీసుకుంటామన్నారు. ఇతడి చేతిలో ఇంకా ఎవరైనా మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు.