
వర్ధమాన సినీ సంగీత దర్శకుడి అరెస్ట్
తణుకు (పశ్చిమగోదావరి జిల్లా) : సినిమాల్లో సింగర్‌గా ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఒక బాలికను కిడ్నాప్ చేశాడన్న అభియోగంపై హైదరాబాద్‌కు చెందిన వర్థమాన సినీ సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ అలియాస్ షేక్ సయ్యద్ హుస్సేన్ ఆలీని తణుకు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ రాజులపాటి అంకబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన సాకేత్ సాయిరామ్ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా ఎదుగుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆయన ఈ ఏడాది మే 22న ఉండ్రాజవరం మండలం పాలంగిలో జరిగిన తన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు.
సాయిరామ్ మరో మిత్రుడి కుమార్తె అయిన సుమారు 15 ఏళ్ల మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా సాకేత్ సాయిరామ్ తనవెంట హైదరాబాద్ తీసుకుపోయాడు. బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇళ్లతోపాటు సమీప ప్రాంతాల్లో వాకబు చేశారు. బాలిక ఆచూకీ దొరక్కపోవడంతో ఉండ్రాజవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై బి.శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ బాలిక కాట్రేనికోనలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు చేరింది. అయితే మరోసారి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన గ్రామానికి వచ్చిన సాయిరామ్ ఆ బాలికను మరోసారి తన వెంట తీసికెళ్లిపోయాడు.
హైదరాబాద్‌లోని ఒక లాడ్జిలో ఆమెను కొన్నాళ్లు నిర్బంధించి అనంతరం సాయిరామ్ మిత్రుడు కిరణ్ ఇంట్లో సైతం కొన్ని రోజులు దాచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న ఉండ్రాజవరం పోలీసులు సాయిరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను కిడ్నాప్ చేసిన విషయం వాస్తవమేనని ఒప్పుకోవడంతో బాలికను అతని చెరనుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సాయిరామ్‌ను బుధవారం సీఐ అంకబాబు కోర్టులో హాజరుపరచగా 15 రోజులపాటు రిమాండ్ విధించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై బి.శ్రీనివాస్, ఏఎస్సై జయకృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, ఎంవీఎస్‌ఎస్‌కే మూర్తి, ప్రసాద్, కృష్ణమూర్తి, రామారావును కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు అభినందించారు.
తమ్మారెడ్డి భరధ్వాజ శిష్యుడిగా చెప్పుకుంటున్న సాకేత్ సాయిరామ్ ఇప్పటివరకు వివిధ భాషల్లో 17 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2008లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన 1940లో ఒకగ్రామం’ చిత్రానికి జాతీయస్థాయి పురస్కారం అందుకున్నాడు. సాకేత్ ఎంతో మందిని ఇలా నమ్మించి మోసం చేయడంతోపాటు యువతులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.