మనోవేదనతో పురుగుమందు తాగి తల్లి ఆత్మహత్యాయత్నం
పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు
అక్కడే పెట్రోల్ పోసుకుని తండ్రీ ఆత్మహత్యాయత్నం
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మడకశిర పట్టణ సమీపంలోని బేగార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక మడకశిర పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల ఐదో తేదీ ఉదయాన్నే కళాశాలకని ఇంటి నుంచి బయల్దేరింది. రాత్రి వరకు ఎదురుచూసినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికారు. బంధువుల ఇళ్లకేమైనా వెళ్లిందేమోనని ఆరా తీశారు. అయినా ఆచూకీ దొరకలేదు.
మరుసటిరోజు శుక్రవారం మడకశిర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడ్రోజులు గడిచినా పోలీసులు బాలిక ఆచూకీని గుర్తించలేదు. దీంతో బాలిక తల్లి శైలజ తీవ్ర మనోవేదనకు గురై సోమవారం ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను మడకశిర ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు.
పోలీసుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి జయరామప్ప కూడా పోలీస్‌స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బంధువులు, కుటుంబసభ్యులు ఆయన్ను వారించడంతో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న సీఐ రాజ్‌కుమార్ అక్కడికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులతో చర్చించారు. ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని సీఐతో వారు వాగ్వాదానికి దిగారు. త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుని బాలికను క్షేమంగా అప్పగిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment