సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తల్లిదండ్రులు తమ బిడ్డల చదువులు, భవిష్యత్తు కోసం డబ్బులు కాదు తగినంత సమయాన్ని ఖర్చు చేయండి, లేకుంటే మాధ్యమాల ప్రభావంలో పడి బతుకును బుగ్గి చేసుకోగలరు జాగ్రత్త’. చెడుదారి పట్టుతున్న నేటి తరం పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఈ హితవు మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి. వివరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా తిట్టకుడి పెరుమలై గ్రామం పుదుకాలనీకి చెందిన ప్రకాష్ (22)ను బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ఈ ఏడాది జూలై 7వ తేదీన అరెస్ట్ చేశారు. 84 రోజుల పాటు జైల్లోఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
నిందితుడు ప్రకాష్ 17 ఏళ్ల బాలికను ప్రేమించి, కిడ్నాప్ చేయడంతోపాటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించాడు. పిటిషనర్ ప్రకాష్ చాలా అమాయకుడని, ఆ బాలికే అతనిపై ఒత్తిడి తెచ్చి పరారైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించాడు. ఇరుతరఫు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి వైద్యనాథన్ పిటిషనర్ ప్రకాష్‌కు గురువారం బెయిల్ మంజూరు చే శారు. ఈ సందర్భంగా పెద్దలు, తల్లిదండ్రులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి సంబంధం చూడడంతో తానే ప్రకాష్‌తో వెళ్లానని బాధిత యువతి తన వాంగ్మూలంలో తెలిపింది.
తనను ఇంటి నుంచి తీసుకెళ్లకుంటే విషం మింగి ఆత్మహత్య చేసుకుంటానని అతడిని బెదిరించింది. తన ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా పెద్దలే తన వివాహాన్ని నిర్ణయించారని ఆ యువతి తెలిపింది. అందుకే ప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశాను’ అని న్యాయమూర్తి తెలిపారు. ఇద్దరి నుంచి రూ.10వేల పూజీ కత్తు చెల్లించి బెయిల్ ఆదేశాలు పొందవచ్చని, అలాగే ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసు స్టేషన్లో సంతకం చేయాలని, విచారణకు పిలిచినపుడు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి తెలిపారు. అంతేగాక ఈ కేసులో సాక్షులను, ఆధారాలను రూపుమాపే ప్రయత్నాలు చేయరాదని, అజ్ఞాతంలోకి వెళ్లరాదని హెచ్చరించారు.
ఈ నిబంధనలు మీరితే కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసేముందు పెద్దలకు కొన్ని విషయాలు చెప్పదలిచానని న్యాయమూర్తి వైద్యనాధన్ అన్నారు. పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చుచేసే కంటే వారి భవిష్యత్తు కోసం కొంత కాలాన్ని ఖర్చుచేయడం ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తించాలని హితవు పలికారు. లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలున్నా 12 నుంచి17 వయస్సు బాలికలు తమకు నచ్చిన యువకులతో ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడుతున్నారని అన్నారు.
దీని వల్ల బాలికలు మాత్రమే కాదు వారితోపాటూ వెళ్లిపోయే బాలురు, యువకులు సైతం బాధితులుగా మిగిలిపోతున్నారని, న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలకు సులభంగా అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాలే కారణమని ఆయన అన్నారు. సినిమాల్లో టీనేజ్ అమ్మాయితో టీనేజ్ అబ్బాయి వెంట పడడం నిజజీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నారని తెలిపారు. సినిమాల్లో మంచి చెడు విశ్లేషించుకోలేని పిల్లలు తప్పుదారిన పడి బలి అవుతున్నారని చెప్పారు. పిల్లలతో పెద్దలు చనువుగా మెలిగి చేరదీసినపుడే వారిలో విచక్షణాజ్ఞానం పెరుగుతుందని అన్నారు. అంతేగాక తల్లిదండ్రుల వద్ద ఏదీ దాచకూడదనే అభిప్రాయం కలుగుతుందని న్యాయమూర్తి చెప్పారు.
పిల్లలతో గడపండి
Published Fri, Sep 30 2016 1:35 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement