=దుబాయ్‌కి అక్రమ రవాణా చేసేందుకు యత్నం
= విమానాశ్రయంలో ఉద్యోగాలంటూ మోసాలు
= నిందితుడు యూసుఫ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: ‘కేరళ సినీ రంగంలో సింగర్‌ని చేస్తా.. బ్యూటీషియన్‌ను చేసి నీ పేరు మారుమోగేలా చేస్తా’.. అంటూ యూసుఫ్ అనే వ్యక్తి నగరానికి చెందిన బాలికను కిడ్నాప్ చేశాడు. కేరళకు తీసుకెళ్లిన అతను అక్కడి నుంచి బాలికను దుబాయ్ పంపే ప్రయత్నాల్లో ఉండగా హుమాయున్‌నగర్ పోలీ సులు వెళ్లినిందితుడి అరెస్టు చేసి.. బాలికను కాపాడారు. ఈ కిడ్నాపర్ మాయమాటలతో కొందరికి ఆర్థికంగానూ టోకరా వేశాడని పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు తెలిపారు. మైనర్ బాలికను ఆమె ఇష్టపూర్వకంగా తీసుకుపోయినా అది అపహరణే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
మాయమాటలతో నమ్మించి...
చెన్నైలోని పప్పల్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముస్తాఫా అలియాస్ యూసుఫ్ రెండేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఫెరోజ్ గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. తాను ఇతర దేశాల నుంచి వివిధ వస్తువుల్ని దిగుమతి చేసి విక్రయిస్తుంటానని ఇంటి యజమానికి చెప్పాడు. ఇరుగు పొరుగుతోనూ పరిచయాలు పెంచుకున్న ముస్తాఫా యజమాని కుమార్తె (14)పై కన్నేశాడు. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించి ఆమెతో మాటకలిపాడు. తనకు కేరళ సినీ రంగానికి చెందిన అనేక మందితో పరిచయాలున్నాయని నమ్మించాడు. తనతో వస్తే గాయనిని చేస్తానని, సినీ రంగంలో బ్యూటీషియన్‌గానూ పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు కల్పిస్తానని వలవేసి ఈనెల 11న తనతో ఆమెను తీసుకుపోయాడు.
బోగస్ ఓటర్ ఐడీ తయారీ...
ఇతడి మాటల గారడీలో పడిన బాలిక తన ఇంట్లో చెప్పకుండా అతనితో వెళ్లిపోయింది. యూసుఫ్ ఆమెను కేరళలోని అలెప్పీలో ఉన్న తన స్నేహితుడు పీఏ హషీమ్ (ఆటోడ్రైవర్) ఇంట్లో ఉంచాడు. బాలికను దుబాయ్‌కి అక్రమ రవాణా చేయాలని పథకం వేసిన ఇతను ఆమెకు పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు అవసరమైన ధ్రువీకరణలు సమకూర్చుకొనేందుకు ఆ బాలిక వయస్సు 18 ఏళ్ల నిండినట్లు చూపిస్తూ, నకిలీ పేరు, బోగస్ వివరాలతో అలెప్పీలోనే ఓటర్ ఐడీ తయారు చేయించాడు. ఓడలో సుదూర ప్రయాణం చేయిస్తానంటూ బాలికను మభ్యపెడుతూ వచ్చాడు. ఈలోపు బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హుమాయున్‌నగర్ పోలీసులు.. యూసుఫ్ అలెప్పీలో ఉన్నట్టు కనిపెట్టారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసి బాలికను కాపాడింది.
దర్యాప్తులో మోసాలు వెలుగులోకి...
యూసుఫ్ వ్యవహారాలపై దర్యాప్తు చేసిన పోలీసులు అతడు వేరే మోసాలకూ పాల్పడినట్టు గుర్తించారు. తనకు రావాల్సిన సరుకు విమానాశ్రయంలో ఆగిపోయిందని, కొంత నగదు చెల్లించాల్సి ఉందని పలువురిని నమ్మించి డబ్బు వసూలు చేశాడని తేలింది. అలాగే సయ్యద్ మిరాజుద్దీన్ అనే వ్యక్తికి ఉద్యోగం పేరుతో ఎరవేశాడు. తనకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పని చేసే ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని నమ్మబలికాడు. మిరాజుద్దీన్ కుమారుడికి విమానాశ్రయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.4.5 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. హుమాయున్‌నగర్‌కు చెందిన బంగారం వ్యాపారి రామేశ్వర్‌లాల్‌తో పరిచయం పెంచుకున్న యూసుఫ్.. తన భార్యకు నాలుగు బంగారు ఉంగరాలు కావాలని వాటిని తీసుకున్న యూసుఫ్ భార్యకు చూపించి వచ్చి నగదు ఇస్తానంటూ ఉడాయించాడు. ఇతడిపై ఈ రెండు కేసులూ కూడా నమోదయ్యాయి.
కేరళ, తమిళనాడులకు వేలిముద్రలు...
యూసుఫ్ వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి గత చరిత్రను తెలుసుకొనేందుకు అతని వేలిముద్రల్ని కేరళ, తమిళనాడుల్లో ఉన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలకు పంపుతున్నామన్నారు. తదుపరి విచారణ కోసం న్యాయస్థానం అనుమతిలో యూసుఫ్‌ను కస్టడీలోకి తీసుకుంటామన్నారు. ఇతడి చేతిలో ఇంకా ఎవరైనా మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు.
సింగ ర్‌ను చేస్తానని బాలిక కిడ్నాప్
Published Fri, Dec 27 2013 5:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement