మా సభల అభిప్రాయాన్ని గౌరవించండి: సీఎం కిరణ్ | Kiran Kumar Reddy urges Pranab Mukherjee to keep Andhra Pradesh united | Sakshi
Sakshi News home page

మా సభల అభిప్రాయాన్ని గౌరవించండి: సీఎం కిరణ్

Published Thu, Feb 6 2014 2:42 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Kiran Kumar Reddy urges Pranab Mukherjee to keep Andhra Pradesh united

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభ, శాసనమండలి చేసిన తీర్మానాన్ని గౌరవిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని 75 నుంచి 80 శాతం మంది ప్రజలు రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని ప్రాంతాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. బుధవారం జంతర్‌మంతర్ వద్ద దీక్ష అనంతరం సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సీఎం అరగంటకుపైగా ప్రణబ్‌తో సమావేశమయ్యూరు.
 
 రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ నాలుగు పేజీల లేఖను అందజేశారు. ఎలాంటి హేతుబద్దమైన కారణాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు లేకుండా విభజన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం భాషా ప్రయుక్త రాష్ట్రాల స్ఫూర్తిని దెబ్బతీసిందని అందులో పేర్కొన్నారు. రాష్ర్ట విభజన విషయంలో జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టిస్ పూంచి కమిషన్ సిఫారసులను పూర్తిగా విస్మరించారన్నారు. ఇకపై కొత్త రాష్ట్రాలను ఎస్సార్సీ ద్వారానే ఏర్పాటు చేయాలంటూ 2010 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగిన రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశంలో చేసిన తీర్మానాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు.
 -    {పణబ్‌తో భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ, ‘‘ఆర్థ్ధిక మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తరువాత ‘నేను ఆ సమయంలో దేశంలో ఉంటే ఆ ప్రకటన వచ్చేది కాదు’ అని మీరు చెప్పిన మాటలు మాకు గుర్తున్నారుు. మీరు విజ్ఞులు. రాష్ర్ట ప్రజల మనోభీష్టం మేరకు చర్యలు తీసుకోండి’’ అని రాష్ట్రపతిని కోరారు.
 -    సీఎం మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకు ఏర్పాటైన రాష్ట్రాలకు సంబంధించి ఒక పద్ధతిని అనుసరించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లేదా కమిటీల నివేదికలకు అనుగుణంగా విభజించారు. అసెంబ్లీ తీర్మానాలనూ పరిగణనలోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అవేమీ పట్టించుకోలేదు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికనూ పరిగణనలోకి తీసుకోలేదు. విడిపోతే తెలంగాణకు నీటి, విద్యుత్ కష్టాలు తప్పవు. సీమాంధ్ర ప్రజలంతా హైదరాబాద్‌తో మమేకమై ఉన్నారు. విడిపోతే వారికీ చాలా నష్టం...’’ అని ప్రణబ్‌కు వివరించారు.  సావధానంగా విన్న రాష్ట్రపతి ఆ తర్వాత సీఎంను ఉద్దేశించి ‘మీరు నాతో రండి’ అంటూ లోపలికి తీసుకువెళ్లారు.  అరగంట భేటీ తర్వాత బయటకొచ్చిన సీఎం మీడియాతో మాట్లాడారు.
 
 రాష్ట్రపతిపై విశ్వాసం ఉంది: సీఎం
 స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ తిరస్కరించినతరువాత కొత్త రాష్ట్రం ఏర్పడిన దాఖలాల్లేవు కాబట్టి.. ప్రజాభీష్టానికి అనుగుణంగా, బిల్లును తిరస్కరిస్తూ ఉభయ సభలు చేసిన తీర్మానాన్ని గౌరవిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతిని కోరినట్లు సీఎం చెప్పారు. ‘‘అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటుకు పంపొద్దని కోరాం. ఇప్పటివరకు రాష్ట్రపతి వద్దకు బిల్లు రాలేదు. వచ్చిన తరువాత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని పూర్తి విశ్వాసం ఉంది..’’ అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
 
 రాష్ట్రపతితో ఏం మాట్లాడారు!
 అరుుతే రాష్ట్రపతితో సీఎం ప్రత్యేకంగా ఏం మాట్లాడారనేది సీమాంధ్ర నేతల్లో చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదని సమాచారం. ఒకరిద్దరు మంత్రులు ఆరా తీసేందుకు యత్నించినా దాటవేసినట్లు తెలిసింది.
 
 ఆ ముగ్గురూ దూరం
 సీఎంతో పాటు రాష్ర్టపతిని కలసిన వారిలో కేంద్ర మంత్రులు కావూరి, పళ్లంరాజు, చిరంజీవి  కూడా ఉన్నారు. బుధవారం సీమాంధ్ర నేతలు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాలన్నిటికీ సీమాంధ్రకే చెందిన కేంద్ర మంత్రులు కిశోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, జేడీ శీలం దూరంగా ఉన్నారు. వారిని ఆహ్వానించినా రాలేదని సీమాంధ్ర నేతలు చెప్పారు.
 
 నేతలు ఫుల్.. జనం నిల్
 -    ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12.45 గంటలకు సీమాంధ్ర నేతలతో కలసి దీక్షా వేదిక వద్దకొచ్చారు. తరలివచ్చిన సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మీడియూతో మాట్లాడేందుకు పోటీలు పడ్డారు.
 -    {పజలు పెద్ద ఎత్తున వస్తారని భావించిన సీమాంధ్ర నేతలు ఏపీ భవన్ అధికారుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేశారు. కానీ వేదిక ముందు జనం పదుల సంఖ్యలో కూడా లేరు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
 -    వేదిక ముందు కూర్చున్న కొద్దిమందీ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చెందిన సీమాంధ్ర జేఏసీ నాయకులు మాత్రమే కావడం గమనార్హం. ఇది గమనించిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన ల్యాంకో సంస్థ నుంచి సుమారు 50 మందిని తీసుకొచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేరుుంచారు.
 -    {పజా స్పందన కరువవడంతో అక్కడికి వచ్చిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వాధినేత ధర్నా చేస్తున్నారంటే చూడటానికి పెద్ద ఎత్తున జనం వస్తారని ఆశించామని.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చర్చించుకున్నారు.
 ఇలా రావడం.. అలా పోవడం
 -    దీక్ష కేవలం మూడున్నర గంటల పాటే సాగినా.. ఆద్యంతం పాల్గొన్న నేతలు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సీఎంతోపాటు బొత్స, శైలజానాథ్ , కాసు వెంకటకృష్ణారెడ్డి మాత్రమే మొదటినుంచీ చివరివరకు కూర్చున్నారు. మిగిలిన వారంతా కొద్దిసేపు కూర్చుని బయటకు వెళ్లి రావడం చేశారు.
 -    కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, చిరంజీవి, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు ఒక్కొక్కరుగా వచ్చి కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోయారు. ఆకలికి తాళలేని మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ఆ పక్కనే లభించే పల్లీలు, బఠాణీలు వంటి తినుబండారాలు నములుతూ కన్పించారు.
 -    ఎమ్మెల్యేలు వంగా గీత, లబ్బి వెంకటస్వామి, సుబ్బరాయుడు తదితరులు ‘‘ఒకే భాష...ఒకే రాష్ట్రం వర్ధిల్లాలి...సమైక్యాంధ్ర వర్ధిల్లాలి, అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఓడించిన విభజనను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టొద్దు, సేవ్ డెమోక్రసీ-సేవ్ ఆంధ్రప్రదేశ్ ’’ అంటూ పదేపదే నినాదాలు చేశారు.
 -    దీక్ష మొత్తంగా ముగ్గురు నేతల కనుసన్నల్లో జరిగినట్లుగా కొట్టొచ్చినట్లు కనబడింది. పీసీసీ చీఫ్ బొత్స, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్‌లు క్రియాశీలంగా వ్యవహరించారు. బొత్స, కేవీపీలు వేదికపై సీఎంకు చెరోపక్క ఆశీనులవగా.. లగడపాటి ఫోన్‌లో మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో మంతనాలు కొనసాగిస్తూ కన్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement