తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా చూపుతారా?
- ఇది దారుణం.. సమైక్య రాష్ట్రంలోనూ ఇలా లేదు: కోదండరాం
- నాడు నాపై ఉన్న కేసులే కేసీఆర్‌పైనా ఉన్నాయి
- ఆయన కూడా నేరానికి పాల్పడినట్టేనా?
- ర్యాలీ, సభ యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం.. హింసగా, నేరంగా చిత్రీకరిస్తోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం వంటి మహత్తర ఉద్యమాలను నేరంగా చిత్రీకరించడం దారుణం, సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్య రాష్ట్రంలోనూ ఇంత ఘోరంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ‘‘మాకు నేరపూరిత చరిత్ర ఉందని, విధ్వంసం జరిగిందని, కోర్టులో చూపెట్టారు. తెలంగాణ కేసులు చూపి అనుమతిని నిరాకరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కుట్రగా చిత్రీకరిస్తున్నారు. నాపై ఆరోపణలు నిజమైతే.. నాతో పాటు ఉద్యమంలో ఉన్న కేసీఆర్‌కు కూడా వర్తిస్తాయని పోలీసులకు తెలియదా? వ్యక్తిగతంగా నాపై, జేఏసీపై నాడు పెట్టిన అన్ని కేసుల్లోనూ కేసీఆర్ ఉన్నారు. ఆయన కూడా నేరానికి పాల్పడినట్టేనా? మాపై పెట్టిన కేసులన్నీ సీఎంపై పెడతారా?’’అని ప్రశ్నించారు. ఇది యువకుల, నిరుద్యోగుల గొంతును అణిచివేయడమేనని అన్నారు.
‘‘జేఏసీ వెనుక తీవ్రవాదులు ఎవరు ఉన్నారు? నిరుద్యోగులు, తెలంగాణ కోసం కొట్లాడిన యువకులు ఇయ్యాల తీవ్రవాదులుగా ప్రభుత్వానికి కనబడుతున్నారా? ఇదేం ప్రజాస్వామ్యం?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ర్యాలీ, సభకు ఎన్టీఆర్ స్టేడియంలో అడిగాం. అక్కడ సాధ్యం కాకుంటే నిజాం కాలేజీ గ్రౌండ్.. నెక్లెస్‌రోడ్‌లో.. కనీసం ఉస్మానియా యూనివర్సిటీలోనైనా ఇవ్వాలని కోరాం. ‘కానీ పోలీసులు నాగోల్‌లో సభ నిర్వహించుకోవాలన్నారు. వసతులు సరిగా లేకపోవడంతో మేం అక్కడ సభ పెట్టుకోలేమని చెఆప్పం. ఇదే విషయం మాతో చర్చించి, వారం రోజుల ముందుగా చెప్పినా ఆలోచించడానికి వీలుండేది. ఎల్‌బీ స్టేడియంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు.. కానీ దానికి అవతల ఉన్న నిజాం కాలేజీ మైదానంలో నిరుద్యోగులు నిరసన సభను జరుపుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు? ప్రభుత్వంలోని పెద్దలకో నీతి, నిరుద్యోగులకు మరో నీతా’’అని నిలదీశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలోనూ సమైక్య రాష్ట్రంలోని అణిచివేత కొనసాగుతోందన్నారు. ఇప్పటికే 600 మందిని అక్రమంగా అరెస్టు చేశారని కోదండరాం వెల్లడించారు. ముందుగా ప్రకటించినట్టు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్కు దాకా ర్యాలీ చేపడతామని స్పష్టంచేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి నిరసన ర్యాలీని చేపడతానని అక్కడ్నుంచి ఇందిరాపార్కు వరకు వెళ్తానని ప్రకటించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు అరెస్టు చేస్తే విద్యార్థులు ఎక్కడికక్కడే రోడ్లపై బైటాయించి శాంతియుత పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.