కోహ్లి బాల్ ట్యాంపరింగ్: సెహ్వాగ్ ఫైర్
-
బ్రిటిష్ మీడియాపై మండిపడిన నజబ్‌గఢ్ నవాబ్
ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్ మీడియా కథనాలు వండివార్చడంపై మాజీ క్రికెటర్, నజబ్‌గఢ్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని ఇంగ్లండ్ గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే.. ఆ జట్టు గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించాడు. ‘ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ‘హిందూస్తాన్ టైమ్స్’ తో మాట్లాడుతూ అన్నారు. రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి బాల్‌ను ట్యాంపర్ చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. చూయింగమ్ నములుతూ ఉన్న కోహ్లి తన లాలాజలాన్ని బాల్‌కు రుద్ది.. అది మెరిసేలా చేశాడని, ఇది బాల్ ట్యాంపరింగ్‌యేనని ఆరోపిస్తూ బ్రిటన్ మీడియా కథనాలు రాసింది. ఇలా లాలాజలముతో బాల్‌ను ట్యాపరింగ్ చేసినందుకు ఇప్పటికే ఐసీసీ దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్‌కు జరిమానా విధించింది.
అయితే, బ్రిటన్ మీడియా కథనాలపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.‘ ఇంగ్లండ్ జట్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఆ దేశ మీడియానే ఇలాంటి రాతలు రాస్తున్నది. ఓటమిని కూడా గౌరవప్రదంగా అంగీకరించాలి. విదేశాల్లో ఓడిపోయినప్పుడు మేం ఎప్పుడూ సాకులు చెప్పలేదు. మేం ఆడలేనందువల్లే ఓడిపోయాం అని మేం గతంలో హుందాగా ఒప్పుకొనేవాళ్లం’ అంటూ బ్రిటన్ మీడియాను ఆయన తప్పుబట్టాడు.