వీడింతే.. ఇక ఎదగడు!
లేలేత బుగ్గలు, అమాయకపు చూపులతో కనిపిస్తున్న వీడు స్కూలుకు వెళ్లే పిల్లాడేమీ కాదు. రాత్రి పూట పబ్బులకు వెళ్తూ, మద్యం సేవిస్తూ మధ్యమధ్యలో అమ్మాయిలతో స్టెప్పులేస్తున్న గడుగ్గాయే. పట్టుమని పన్నెండేళ్లు కూడా లేని ఈ పిల్లాడికి ఇవేం పాడు బుద్ధులనుకుంటే పొరపాటే. 'నువ్వు పిల్లాడివి.. నిన్ను పబ్‌లకు అనుమతించం' ’అంటూ పబ్బుల ద్వారపాలకులు అడ్డుకున్నప్పుడల్లా ఇతడు తన ఐడీ కార్డులో ఉన్న బర్త్ డేను దర్జాగా చూపించి లోపలికెళతాడు.
విషయం ఏమిటంటే, 1989లో జన్మించిన ఇతడికి ఇప్పుడు సరిగ్గా 26 ఏళ్లు. 'హైలాండర్ సిండ్రోమ్' అనే జబ్బుతో బాధపడుతున్న ఇతడికి ఎదుగుదల టీనేజీలో ఆగిపోయిందట. జీవించినంత కాలం ఇలా పిల్లాడిలానే కనిపిస్తాడని, ఈ జబ్బుకు మందు లేదని వైద్యులు చెబుతున్నారు. అయినా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని, దిగులు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. హ్యోమియుంగ్ షిన్ అనే పేరుగల ఇతడిని 'పీటర్ పాన్ ఆఫ్ కొరియా' అని పిలుస్తున్నారు. పబ్బుల్లో అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నా చిన్న పిల్లాడిలానే భావించి బుగ్గలు గిల్లుతున్నారట తప్ప, యుక్త వయస్సు వచ్చిన యువకుడిగా ఎవరు ఫీలవడం లేదని పాపం తెగ ఫీలయిపోతున్నాడు. ఏరోజుకైనా తగిన అమ్మాయి దొరక్కపోతుందా అన్న ఆశతో క్రమం తప్పకుండా పబ్బులకు వెళుతున్నాడట. ప్రస్తుతానికి హాలీవుడ్ తార స్కార్లెట్ జోహాన్సన్ క్యాలెండర్‌ను గది గోడకు తగిలించుకొని ఆరాధిస్తున్నాడు.