-ఇరు రాష్ట్రాలపై బోర్డు ఆగ్రహం
- ఒప్పందాలకు విఘాతం అంటూ లేఖ
సాక్షి, హైదరాబాద్
కృష్ణా జలాల నీటి వినియోగం విషయంలో తమకు మాటమాత్రమైన చెప్పకుండా,కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలు విస్మరించి నీటిని వాడుకోవడాన్ని తీవ్రంగా పరగణిస్తామని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఇరు రాష్ట్రాలకు బోర్డు వేర్వేరుగా లేఖలు రాసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా, పోతిరెడ్డిపాటు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లించుకున్నాయని, ఈ విషయంలో తెలంగాణ ఫిర్యాదు చేసే వరకు తమకే ఆ విషయమే తెలియలేదని లేఖలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు నీటిని వాడుకుంటున్నామన్న కనీస సమాచారం ఇవ్వలేదని, నీటి వాడకంపై త్రిసభ్య అనుమతి తీసుకోవాలని గత ఒప్పందాల సందర్భంగా నిర్ణయించినా వాటిని ఉల్లంఘించి నీటిని వాడుకున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ నీటి వినియోగాన్ని బోర్డు తప్పుపట్టింది. జూరాల నుంచి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడులకు తెలంగాణ నీటిని వాడుకుంటోందని, ఆ నీటి వాడకాన్ని తమకు తెలుపలేదని పేర్కొంది. అనుమతి లేకుండా, త్రిసభ్య కమిటీలో చర్చించకుండా నీటి వాడకాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ వద్ద కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని సూచించింది. దీంతో పాటే ప్రాజెక్టుల వారీ నీటి పరిస్థితులు, ఇరు రాష్ట్రాల అవసరాలు, మైనర్ ఇరిగేషన్ కింద వినియోగిస్తున్న నీటిపై వివరాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, ఇప్పటికై దీనిపై స్పందించాలని సూచించింది.
త్రిసభ్య కమిటీకి చెప్పకుండానే నీటిని తోడేస్తారా?
Published Thu, Aug 11 2016 8:43 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement
Advertisement