అతని లవర్ అనే ముద్రవేయకండి: నటి
తెలుగులో మహేశ్ బాబు 'వన్', నాగచైతన్యతో 'దోచెయ్' వంటి సినిమాల్లో నటించిన కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటివరకు హిందీలో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. 'ధోనీ' హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగానే ఆమె మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొట్టేది.
కానీ, కృతి తాజా సినిమా 'బరేలీకి బర్ఫీ'తో పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాగా విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రంలో కృతి నటనకు ప్రేక్షకులే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 'బరేలీకి బర్ఫీ' సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కృతి సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇకనైన తనను ఒక నటిగా గుర్తించాలని, ఒకరి లవర్‌గా ప్రచారం చేయడం తగదని ఆమె చెప్తోంది.
'నటులుగా మా వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తాం. కానీ, మా పనిని చూడకుండా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టడం బాధ కలిగిస్తుంది. ఇప్పటికైనా, 'బరేలీ కి బర్ఫీ'లో నా నటనను మెచ్చుకోవడం ఆనందంగా ఉంది' అని కృతి తెలిపింది.