సాక్షి, ముంబై: రండి బాబూ.. రండి..! మా ఫ్లాట్ ధరెంతో ఊహించి చెబితే పది గ్రాముల బంగారం ఉచితం..! మా ఫ్లాట్‌ను వచ్చి చూస్తే చాలు ఫైవ్‌స్టార్ హోటల్లో పసందైన విందు..! కొనుగోలుదారులను పరిచయం చేసినవారికీ తగిన బహుమతులు..! ..ఇవీ నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారసంస్థల ప్రకటనలు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు, ఫ్లాట్లు కొనేవారు లేక ఖాళీగానే ఉంటుండడంతో వినియోగదారులను అకట్టుకునేందుకు రియల్ సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆ సంస్థల పాచికలేవీ పారడంలేదు. పోనీ ధరలు తగ్గించి విక్రయిద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి నెలకొంది. దీంతో ధరను తగ్గించలేక, తాము చెప్పిన ధరకు కొనేవారెవరూ ముందుకురాకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారలు బెంబేలెత్తిపోతున్నారు.
అంతా ఆర్థిక మాంద్యం ప్రభావమే..
దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా కనిపిస్తోంది. గత రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినడంతో బిల్డర్లు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారే అవకాశముంది. ముంబై, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో ఇప్పటికే లక్షకుపైగా ఫ్లాట్లు అమ్ముడుపోలేక ఖాళీగానే పడిఉన్నాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకునేందుకు బిల్డర్లు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారు. అయినప్పటికీ ఎవరూ ముందుకురావడం లేదు. ఈ వ్యాపారం గత మూడు నెలల నుంచి మరింత దయనీయంగా మారిందని కొందరు బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ముంబైతోపాటు దేశంలోని ఆరు ప్రధాన నగరాలలో ఉందని లియాసెస్ ఫోరస్ రియల్ ఎస్టేట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఎండీ పంకజ్‌క పూర్ తెలిపారు. ఈ నగరాల్లో దాదాపు 40 శాతం ఇళ్ల డిమాండ్ పడిపోయిందని, ఒక్క ముంబైలోనే నిర్మాణం పూర్తిచేసుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్న లక్షకుపైగా ఫ్లాటు ఖాళీగా ఉన్నాయన్నారు. అంతేకాక దాదాపు ఇంతే సంఖ్యలో పెట్టుబడుదారులు కొనుగోలు చేసిన ఫ్లాట్లలో కూడా 40 శాతం ఖాళీగానే ఉన్నాయని చెప్పారు. దీంతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేవారి సంఖ్య 50 శాతానికి పడిపోయిందని, పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే ఉంటుందనే అభిప్రాయాన్ని పంకజ్‌కపూర్ వ్యక్తం చేశారు.
రిజర్వ్ బ్యాంకు చర్యలే కారణం...
భారీ పెట్టుబడులతో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లోని ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదనే విషయమై విశ్లేషకులు అనేక కారణాలను చూపుతున్నారు. ద్రోవ్యల్బణాన్ని తగ్గించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల కారణంగా ఆర్థిక సంస్థలు రుణాలను ఇచ్చేందుకు జంకుతున్నాయని, దీంతో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఆర్థిక సంస్థల నుంచి రుణాలను సేకరించడం కష్టంగా మారిందని, కొనుగోళ్లు తగ్గడానికి ఇది ప్రధాన కారణమంటున్నారు. అంతేకాక పెరిగిన పన్నులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఈ పరిస్థితికి కారణమేనని చెబుతున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఇతర వస్తువుల ధరలతోనే విలవిల్లాడుతున్న సామాన్యుడు ఇల్లు కొనాలనే విషయమై కలలో కూడా ఆలోచించడంలేదంటున్నారు. కాస్తోకూస్తో కొనే సామర్థ్యమున్న మధ్య తరగతివారు పన్నులు, రిజిస్ట్రేషన్లకు భయపడి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని చెబుతున్నారు.
తలలుపట్టుకుంటున్న నేతలు...
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితిలో క్రయవిక్రయాలు జరగకపోవడంతో వారి డబ్బంతా ఈ వ్యాపారంలోనే చిక్కుకుపోయింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేతిలో డబ్బు ఉంటేకాని పనులు కాని పరిస్థితి. దీంతో ఈ దుస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక నేతలు తలలుపట్టుకుంటున్నారు.
లక్ష ఫ్లాట్లు ఖాళీ!
Published Mon, Aug 19 2013 11:58 PM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM
Advertisement