భారీ కుంభకోణంలో బీజేపీ నేతలు?
పట్నా: బిహార్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సుమారు 502 కోట్ల ఫండ్‌ను ఓ ఎన్జీవో కంపెనీకి మళ్లించారన్న ఆరోపణలు రావటంతో ప్రభుత్వం, ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను రంగంలోకి దించింది. పట్టణాభివృద్ధికి కేటాయించిన నిధులను బ్యాంకుల నుంచే నేరుగా ఆ సంస్థకు తరలించారని ప్రాథమిక విచారణలో తేలింది.
అయితే ఇందులో బీజేపీ నేతల హస్తం ఉందని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. షాహనవాజ్ హుస్సేన్, గిరిరాజ్ సింగ్ లు సదరు ఎన్జీవో వ్యవస్థాపకులు మనోరమ దేవితో సంబంధాలు ఉన్నాయని లాలూ చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఈ నేతల ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. "ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. ఇందులో బ్యాంకుల ప్రమేయం కూడా ఉందని తేలింది. అందుకే సీబీఐతో విచారణ జరిపించాలి" అని లాలూ డిమాండ్ చేస్తున్నారు.
లాలూ ఆరోపణలపై హ్సుస‍్సేన్ స్పందించారు. మనోరమ దేవి తనకి తెలిసినప్పటికీ ఈ స్కాంతో తనకేలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ముఖ్య మంత్రి నగర వికాస్ యోజన పథకం కింద జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వం నగదు డిపాజిట్ చేయగా, ఆ సొమ్ము భగల్పూర్ జిల్లాలోని శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి అనే ఎన్జీవోకు తరలించారు. మహిళల ఉపాధి కల్పన, వృత్తి కోర్సులు ఈ సంస్థ నిర్వహిస్తోంది. సొంతంగా బ్యాంకు నిర్వహణ కోసం ఈ మధ్యే ఆర్బీఐకు దరఖాస్తు కూడా చేసుకుంది. స్కాం నేపథ్యంలో విచారణ ముమ్మరం చేసిన సిట్ ఐదు కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్ట్ కూడా చేసింది.