
వాళ్లను చంపేశా.. నేను చస్తా!
* తండ్రితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడిన అమిత్‌సింగ్
* నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు
హైదరాబాద్: ‘‘నన్ను ప్రేమించి వంచించిన శ్రీలేఖతో పాటు అడ్డువచ్చిన ఆమె అక్కను కూడా చంపేశా. ఇది మీకు చెప్పేందుకు ఫోన్ చేశా. ఇక నేను కూడా చస్తాను నాన్న’’
తన ప్రేమను తిరస్కరించిందన్న కసితో యువతిని, ఆమె సోదరిని అత్యంత కర్కశంగా హత్య చేసి పారిపోయిన మృగాడు అమిత్ సింగ్ తన తండ్రితో ఫోన్‌లో చివరిసారిగా మాట్లాడిన మాటలు ఇవి..
హైదరాబాద్‌లోని కొత్తపేటలో మంగళవారం అక్కాచెల్లెళ్లు యామిని సరస్వతి, శ్రీలేఖను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారైన నిందితుడు అమిత్‌సింగ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అమిత్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మరింత సమాచారం కోసం అతడి ఇద్దరు స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నట్లు సమాచారం. అక్కాచెల్లెళ్ల లను హత్య చేసిన తర్వాత అమిత్‌సింగ్ ఉప్పల్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది.
ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ గాలిస్తున్నారు. అలాగే ఉప్పల్ నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వెళ్లి... ఢిల్లీకి రైళ్లో ఏమైనా వెళ్లి ఉంటాడా అని తెలుసుకునేందుకు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 4 బృందాలుగా విడిపోయిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు కూడా కొంత మంది పోలీసులు వెళ్లినట్టు తెలుస్తోంది.
కాగా, హత్యోదంతం తర్వాత అమిత్ తనతో చివరిసారిగా మాట్లాడాడని అతడి తండ్రి అమర్‌సింగ్ పోలీసుల ముందు అంగీకరించినట్టు సమాచారం. ‘నువ్వు ఎక్కడున్నావో ఇప్పుడు అక్కడే ఉండు. పోలీసు స్టేషన్‌కు వెళదాం’ అని తండ్రి అంటే.. ‘ఇక నేను బతకను.. చస్తాను నాన్న..’ అని చెప్పి అమిత్ ఫోన్ స్విచ్చాప్ చేసినట్టు తెలిసింది. కాగా, దాదాపు 15 రోజుల క్రితం ఓ స్నేహితుడి నుంచి అమిత్ రూ.2,000 తీసుకున్నట్టు, ఈ డబ్బులతోనే కత్తి, సుత్తె కొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.