లాయర్లు సమ్మె చేయరాదు
సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: న్యాయవాదులు సమ్మెకు దిగడం, కోర్టులు బహిష్కరించడం చేయరాదని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. జస్టిస్ కురియన్, జస్టిస్ అరుణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘సమ్మె ఓ బ్రహ్మాస్త్రం. ఎవరైనా దీన్ని విపత్కర పరిస్థితిలోనే ఉపయోగించాలి. కానీ తరుచుగా సమ్మె మంత్రం జపిస్తున్నారు. ఇది చాలా సీరియస్ సమస్య. న్యాయవాదులు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీన్ని పాటించాలి’ అని పేర్కొంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయవాదులు ఆస్తుల విచారణాధికార పరిధిపై సమ్మె చేయడంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా కామన్‌కాజ్ అనే ఎన్జీవో పిల్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
న్యాయవాదుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ దీనిపై స్పందిస్తూ సమ్మె చేయడమనేది కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని అన్నారు. ఈ విషయమై న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నా రు. బార్ అసోసియేషన్లు కూర్చొని చర్చించి నెలల వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం లభించేటట్టు చూడాలని కోరింది. ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ ధర్మాసనం తీర్పును భేఖాతరు చేసిన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ జిల్లా బార్ అసోసియేషన్ సమన్వయ కమిటీ చైర్మన్‌కు, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.