
'ఎలా ప్రేమించాలో నేర్పావు గానీ..'
ఎలా ప్రేమించాలో నేర్పావు గానీ.. ఎలా ఆపాలో చెప్పలేదు.. అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఓ సందేశం అమిత్ సింగ్ నంబర్‌తో వాట్సాప్‌లో మంగళవారం కనిపించింది. దీన్ని బట్టి అతని ఉద్దేశాన్ని గ్రహించవచ్చు.
హైదరాబాద్: 'మా అమ్మాయిని వేధిస్తున్నాడు... ఇక నుంచి ఆ ఆగడాలు ఆపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంద'ని మృతుల తల్లి హైమావతి నిందితుడి తల్లిదండ్రులను హెచ్చరించింది. వారం క్రితం తమ బంధువులతో కలిసి షాద్‌నగర్‌కు వెళ్లిన ఆమె... అమిత్ సింగ్‌ను కూడా మందలించింది. తొలి రెండు రోజులు శ్రీలేఖ ఇంటివైపు అమిత్ సింగ్ కన్నెత్తి చూడలేదు. ఆ రెండు రోజులు తీవ్రంగా ఆలోచించుకున్న అమిత్... శ్రీలేఖ తనకు దక్కదని...అంతమొందించాలనుకున్నాడు.
శుక్రవారం నుంచి ఇంటి దగ్గర రెక్కీ మొదలు పెట్టాడు. ఇంటి బాధ్యతలు చూసుకునే అమ్మమ్మ నారమ్మ మహబూబ్ నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిందని తెలుసుకున్నాడు. శని, ఆది, సోమవారం.. ఇలా మూడు రోజుల పాటు ఆ ఇంటి ముందరే చక్కర్లు కొట్టాడని స్థానికులు చెబుతున్నారు. మంగళవారం అక్క యామినికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తోడుగా శ్రీలేఖ ఉంది. అప్పటికే వాళ్ల అమ్మ విధుల కోసం మహబూబ్ నగర్ బయలుదేరింది.
అప్పుడే అప్రమత్తం చేసి ఉంటే..
ఉదయం ఏడు గంటల నుంచే ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న అమిత్ సింగ్ శ్రీలేఖకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో ‘ఇంటి బయటకు రా... మాట్లాడాలి’ అంటూ ఎస్‌ఎంఎస్ పంపించాడు. ఆ విషయం ఇంటిపైన ఉండే సురేశ్ కుటుంబ సభ్యులకో... పోలీసులకో చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు.
నిమిషాల్లోనే..
యామినికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో శ్రీలేఖ ఇంటిపైన ఉండే సురేశ్ టిఫిన్ తీసుకొద్దామని 8.20 గంటలకు బయటకు వెళ్లడాన్ని అమిత్ గమనించాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నేరుగా ఇంట్లోకి వెళ్లి శ్రీలేఖపై ఎనిమిదిసార్లు దాడి చేశాడు. ఇది గమనించిన యామిని అడ్డుకునేందుకు యత్నించగా ఆమెను కూడా 18 సార్లు పొడిచాడు. దాదాపు 20 నిమిషాల్లోనే ఈ ఘోరం చేసి పరారయ్యాడు. వారిని పొడిచిన తీరు అమిత్‌సింగ్‌లోని ఉన్మాదానికి అద్దం పడుతోంది.
స్నేహితులు సహకరించారా?
ఘటనా స్థలిలోనే అమిత్ చెప్పులు, బ్యాగు, కత్తులు, సుత్తి, వైరు వదిలేసి వెళ్లాడు. పట్టుకునేందుకు వచ్చిన రంజిత్‌ను నెట్టి.. మెయిన్‌గేట్ నుంచి పక్కనే ఉన్న ఓపెన్ ఫ్లాట్ లోపలికెళ్లాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతనికి స్నేహితులు ఎవరైనా సహకరించారా? అన్న దిశగా ఆరా తీస్తున్నారు.
అన్ని చోట్లా గాలింపు..
శ్రీలేఖ కోసం ఆరు నెలలుగా స్థానికంగానే అమిత్ కిరాయికి ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. ఏ ఏ ఇళ్లలో ఉన్నాడనే వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిందితుడు ఏ మార్గాల్లో వెళ్లడానికి అవకాశం ఉందో... ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లతో పాటు ఎక్కడ తల దాచుకునే ఆస్కారం ఉందో ఆ ప్రాంతాల్లో నాలుగు బృందాలు జల్లెడ పడుతున్నాయి. బీహార్ వెళ్లే అవకాశం ఉండటంతో అటువైపుగా కూడా దృష్టి సారించారు.
షరీఫ్‌గా పరిచయం
హయత్‌నగర్‌లోని అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్‌లో బీటెక్ చదువుతున్నానని అమిత్‌సింగ్ స్థానికులకు చెప్పేవాడు. బాధితురాలి ఇంటికి సమీపంలోని ఓ గ్రౌండ్‌లో రెండురోజులకొకసారి క్రికెట్ ఆడుతుండేవాడు. కొన్నిసార్లు శ్రీలేఖతోనూ అక్కడ మాట్లాడడని... ఆ సమయంలో ఆమె స్నేహితురాళ్లతో షరీఫ్‌గా పరిచయం చేసుకున్నాడని తెలుస్తోంది.
త్వరలోనే పట్టుకుంటాం
అక్కాచెల్లెళ్ల హత్య జరిగిన తీరు నిందితుడి ఉన్మాదాన్ని చాటి చెబుతోంది. ఇది దారుణం. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మా సిబ్బంది బృందాలుగా విడిపోయి నిందితుడి కోసం గాలిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం.
-సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్.