దొంగలా వచ్చి.. దొరికేశాడు!
దొంగలా వచ్చి.. దొరికేశాడు!
Published Mon, Jan 9 2017 5:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
వివాహేతర సంబంధాలు పలు రకాలుగా ఉంటాయి. కానీ పుణెలో జరిగిన ఘటన మాత్రం అన్నింటికంటే విచిత్రమైనది. శుక్రవారపేటలో నివాసం ఉంటున్న ఓ జంట ఇంటికి భార్య ప్రియుడు రహస్యంగా వచ్చాడు. అది కూడా ఎవరూ తనను గుర్తుపట్టకుండా మహిళలు ధరించే నైటీ వేసుకుని, ముఖం మీద స్కార్ఫు కట్టుకుని మరీ వచ్చాడు. ఆ సమయానికి మహిళ భర్త నిద్రిస్తుండటంతో.. అతడిని పూర్తి నిద్రలోకి పంపేందుకు ముఖం మీద క్లోరోఫాం చల్లిన గుడ్డ పెట్టాలనుకున్నాడు. కానీ.. సరిగ్గా అదే ప్రయత్నంలో ఉండగా ఆ భర్తకు దొరికిపోయాడు. తీరా అతడి ముసుగు తీసి చూస్తే, గతంలో తన స్నేహితులలో ఒకడే!
నిందితుడు రాజేష్ ఘుసులాల్ మెహతా (44) రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేస్తాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ప్రేయసి భర్త స్టీలు పాత్రల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి ఇద్దరు పిల్లలున్నారు. అతడితో మెహతాకు వ్యాపారపరంగా స్నేహం కుదరడంతో తరచు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. బహుశా ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో ఇలాగే మత్తుమందు వాసన చూపించి భర్తను మత్తులోకి పంపి తన పని కానించుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాను లేనప్పుడు మెహతా తన ఇంటికి వచ్చి వెళ్తున్న విషయాన్ని సెక్యూరిటీ గార్డు తనకు చెప్పాడని, దాంతో ఏడేళ్లుగా వాళ్లిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి ఇటీవలే తనకు తెలిసిందని ఆ భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో మెహతాను ఇక తన ఇంటివైపు చూడొద్దని హెచ్చరించానన్నారు. అయినా ఆగని మెహతా, ఇలాగే అమ్మాయి వేషంలో వచ్చిపోయేవాడు. అయితే తాజాగా అతడు చేసిన ఇలాంటి ప్రయత్నం విఫలమైంది. ఉన్నట్టుండి ముక్కుదగ్గర పాత వస్త్రం తాలూకు కంపు రావడంతో ఆ భర్తకు మెలకువ వచ్చింది. దాంతో నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడిపై సెక్షన్ 452, 323, 504, 506ల కింద కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement