ఉత్సాహంపై నీళ్లు.. జాన్వీకి చుక్కెదురు!
శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి.. దేశభక్తి చాటుకోవాలనుకున్న లుధియానా బాలిక జాన్వీ బెహల్ (15)కు చుక్కెదురైంది. ఆదివారం శ్రీనగర్ కు వచ్చిన ఆమెను, ఆమె మద్దతుదారులను భద్రతాదళాలు ఎయిర్ పోర్టులోనే నిలువరించాయి. లాల్ చౌక్ లో జెండా ఎగురవేయాలన్న ఆమె ప్రయత్నాన్ని వేర్పాటువాదులు అడ్డుకునే అవకాశం ఉండటంతో వారిని ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపించారు. దీంతో జాన్వీ భారత అనుకూల నినాదాలు చేస్తూ శ్రీనగర్ నుంచి వెనుదిరిగారు.
జాతి వ్యతిరేక నినాదాల విషయంలో జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ కు సవాలు విసరడం ద్వారా జాన్వీ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాతి వ్యతిరేక నినాదాల విషయంలో కన్హయ్యకుమార్ కు దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఆమె సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసి తన దేశభక్తిని చాటుకోవాలని జాన్వీ భావించారు. అయితే, తన మిషన్ పూర్తికాకపోవడం నిరాశను కలిగించిందని జాన్వీ తెలిపారు.