మారని ‘ప్రైవేటు’ తీరు! | M-set of extreme confusion counseling | Sakshi
Sakshi News home page

మారని ‘ప్రైవేటు’ తీరు!

Published Sat, Aug 22 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM

మారని ‘ప్రైవేటు’ తీరు!

మారని ‘ప్రైవేటు’ తీరు!

ఎం-సెట్ కౌన్సెలింగ్‌లో తీవ్ర గందరగోళం
 బ్యాంక్ గ్యారెంటీ కోసం విద్యార్థులపై ఒత్తిడి
గ్యారెంటీ ఇవ్వని వారి నుంచి తొలి ఏడాది ఫీజు తీసుకోని వైనం
 ఆందోళనలో విద్యార్థులు.. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద
విద్యార్థి సంఘాల ధర్నా


హైదరాబాద్: తీవ్ర గందరగోళం మధ్య ప్రైవేటు వైద్య విద్య సీట్లకు శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. విద్యార్థులు ఎన్ని రకాలుగా విజ్ఞప్తి చేసుకున్నా, తమ గోడు వెళ్లబోసుకున్నా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల తీరు ఏమాత్రం మారలేదు. కౌన్సెలింగ్‌కు వచ్చిన మెరిట్ విద్యార్థులను ఏదో రకంగా వెనక్కి పంపడమే లక్ష్యంగా వ్యవహరించారు. ఎంబీబీఎస్‌కు తొలి ఏడాది ఫీజు రూ.9 లక్షలతో పాటు మిగతా నాలుగేళ్లకుగాను రూ.36 లక్షలకు బ్యాంకు గ్యారెంటీ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకపోతే తొలి ఏడాది ఫీజునూ తీసుకోలేదు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు కూడా కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పలువురు విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. ఇక శుక్రవారం నాటి కౌన్సెలింగ్‌లో 422 ఎంబీబీఎస్ సీట్లు, 14 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. రాత్రి సుమారు 8.30 గంటల వరకు సాగిన ఈ కౌన్సెలింగ్‌కు మొదటి రోజు వెయ్యి ర్యాంకుల వరకు విద్యార్థులను పిలిచారు. శనివారం కూడా కౌన్సెలింగ్ కొనసాగనుంది. మరోవైపు ప్రైవేట్ కాలేజీలు సీట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.
 
గ్యారెంటీ ఇవ్వకుంటే రద్దు!
రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ కేటగిరీ(35 శాతం)లో 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లకు కౌన్సెలింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. సీటు పొందినవారు మొదటి ఏడాది ఫీజుతోపాటు ఎంబీబీఎస్‌కు నాలుగేళ్లు, బీడీఎస్‌కు మూడేళ్ల బ్యాంకు గ్యారెంటీ చూపించాలని యాజమాన్యాలు నిబంధన పెట్టాయి. ఈ నెలాఖరు నాటికి ఫీజు, బ్యాంకు గ్యారంటీ రెండూ ఇవ్వకపోతే సీట్లు రద్దవుతాయని హెచ్చరిస్తున్నాయి. అయితే ఇలా రద్దయిన సీట్లను ఎన్నారై సీట్లుగా పరిగణి స్తారు. అప్పుడు వీటిని కోట్ల రూపాయలకు అమ్మేసుకునేందుకు, ఇప్పటికే డబ్బులిచ్చిన వారికి కట్టబెట్టేందుకు ప్రైవేటు యాజమాన్యాలు కుట్రపన్నాయి. మొదటి రోజు హాజరైన వారిలో ఎక్కువ మంది బ్యాంకు గ్యారెంటీ ఇవ్వలేదు. ఫీజు, నాలుగేళ్ల బ్యాంకు గ్యారెంటీ, ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ ఓపీనియన్‌కు మొత్తం కలిపి రూ.50లక్షలు అవుతాయి. ఒకేసారి అంత సొమ్ము తేవడం సాధ్యంకాదని తల్లిదండ్రులు అంటున్నారు. తమ పిల్లలు సాధించిన సీటును వదులుకోవడమే తప్ప మరో దారిలేదని వాపోతున్నారు. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు పొందిన కొందరు.. తెలంగాణ ఎం-సెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. వారికి సర్టిఫికెట్లు అక్కడి కాలేజీల్లో ఉండడంతో.. సంబంధిత కాలేజీ, ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ కస్టోడియన్ ధ్రువపత్రాలను ఇచ్చాయి. కానీ ఇక్కడి ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం కౌన్సెలింగ్‌కు వారిని అనుమతించలేదు. దీనిని కోర్టులో సవాల్ చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
 అంత సొమ్ము ఒకేసారి ఎలా ఇవ్వగలను
 ‘‘ఖమ్మంలో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నా కుమార్తెకు కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. మొదటి ఏడాది ఫీజుతోపాటు బ్యాంకు గ్యారెంటీ ఒకేసారి ఇవ్వాలన్నారు. మొదటి ఏడాది ఫీజు రూ.9లక్షల డీడీ తీసుకొచ్చినా తీసుకోలేదు. ఒకేసారి రూ.36లక్షలకు బ్యాంకు గ్యారెంటీ తీసుకొచ్చే స్తోమత నాకు లేదు. ఈనెల 31వ తేదీ నాటికి గ్యారెంటీ తీసుకురమ్మన్నారు. లేకపోతే సీటు ఉండదంటున్నారు. బ్యాంకు గ్యారెంటీ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలి..’’
     - సత్యనారాయణ, ఖమ్మం
 
 ఒకేసారి ఎలా సాధ్యం
 ‘‘మా అమ్మాయి రెండుసార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ర్యాంకు సాధించింది. ఇప్పుడు ఒకేసారి ఫీజు, బ్యాంకు గ్యారెంటీ అడుగుతున్నారు. అంత సొమ్ము ఎలా తీసుకొని రాగలం? ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనను ప్రైవేటు కాలేజీలు తీసుకొచ్చాయి. దీన్ని ప్రభుత్వం రద్దు చేయాలి..’’    
     - బి.వనజాక్షి, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement