సామాన్యుడిలా ముఖ్యమంత్రితో రాజకీయ చర్చ
న్యూఢిల్లీ: ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిని కలిసి, దేశ రాజకీయాల గురించి, వ్యవస్థలో మార్పుల గురించి ప్రశ్నలు వేయడం, వాటికి సీఎం సావధానంగా సమాధానాలు చెప్పడం మామూలుగా అయితే సాధ్యంకాదు. ఆ సామాన్యుడు.. తనదైన రంగంలో అసామాన్యుడు అనిపించుకుంటే తప్ప!
రాజకీయ శక్తుల కారణంగా కొడుకును పోగొట్టుకున్న ఓ తండ్రి.. వ్యవస్థలో మార్పుకోసం ఏం చేశాడు అనే కథాంశంతో సోషల్ థ్రిల్లర్ జానర్ లో రూపొందించిన సినిమా 'మదారి'. ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా అనే సోషల్ థ్రిల్లర్ సినిమా జులై 22న విడుదలకానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ సామాన్యుడిలా రాజకీయవేత్తలను కలిసి రకరకాల ప్రశ్నలు వేస్తారన్నమాట. (సామాన్యుడు తిరగబడితే..!)
గతంలో పట్నా వెళ్లి జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ను కలిసిన ఇర్ఫాన్.. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలుసుకున్నారు. సాధారణ పౌరుడు ఈ వ్యవస్థలో ఎలా కలిసి బతకాలి, దేశ రాజకీయాలు ఎటు పోతున్నాయి, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అడ్డుతగులుతోన్న ఆంక్షలు.. తదితర విషయాలపై ఇర్ఫాన్ ప్రశ్నలు వేయగా, కేజ్రీవాల్ సమాధానాలు చెప్పారు. దాదాపు అరగంట పాటు వీరి భేటీ సాగింది. (రజనీ సినిమాపై జస్ట్ జోక్ చేశాను!)
మదారి ప్రచారంలో భాగంగా ట్విట్టర్ ద్వారా ముఖ్య రాజకీయ నేతలను కలుస్తోన్న ఇర్ఫాన్ ఖాన్.. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ వీపీ రాహుల్ గాంధీలను సైతం అపాయింట్ మెంట్ అడిగారు. 'ఓ లేఖ పంపితే పరిశీలిస్తాం' అని పీఎంవో నుంచి ఇర్ఫాన్ కు సమాధానం రాగా, రాహుల్ గాంధీ నుంచి మాత్రం ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు.