మోడీపై మధుయాష్కీ విసుర్లు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలతో వాగ్యుద్ధానికి దిగారు. తాము నాగపూర్(ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్లో ఉంది) ఆదేశాలు పాటించడం లేదని యాష్కీ ఎద్దేవా చేశారు. నాగపూర్ లేదా అహ్మదాబాద్ ఈ రెంటిలో ఎక్కడి నుంచి వచ్చే ఆదేశాలు పాటించాలో తెలియక బీజేపీ నేతలు తికమకపడుతున్నారని పరోక్షంగా మోడీపై విమర్శలు గుప్పించారు. గుజరాత్లో అభివృద్ధిని గోరంతలు కొండతలు చేసి చెబుతున్నారని ఆయన విమర్శించారు. గుజరాత్ వాస్తవ ఆర్థికాభివృద్ధిని చూపించకుండా మాయ చేస్తున్నారని ఆరోపించారు.
దీంతో బీజేపీ సభ్యులు అనంతకుమార్ కలగజేసుకున్నారు. మధ్యప్రదేశ్కు సీఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ ఏమీ చేయలేదని, తమ పార్టీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని కౌంటర్ ఇచ్చారు. మధ్యప్రవేశ్తో పాటు నాలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల సంవాదం ఆసక్తి రేకిత్తించింది.