Madhu Goud Yaski
-
టీఆర్ఎస్, బీజేపీలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు: మధు యాష్కీ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుని కేంద్రానికి కప్పం కడుతున్నారని కాంగ్రెస్ లీడర్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు వాళ్ల పోలాల్లో వరిధాన్యాన్ని పండిస్తూ.. రైతులను మాత్రం ఈ యాసంగిలో వరి వేయోద్దని బలవంతం చేస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని.. వరిధాన్యం కొనేవరకు పార్లమెంట్ లోపల, బయట టీఆర్ఎస్తో పోరాటం చేస్తుందన్నారు. నోట్ల రద్దు, కరోనాతో ఉద్యోగాలు లేక మధ్యతరగతి, బడుగు వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాలు ప్రారంభమవుతాయని మధుయాష్కీ, టీఆర్ఎస్ను హెచ్చరించారు. చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి -
మోడీపై మధుయాష్కీ విసుర్లు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలతో వాగ్యుద్ధానికి దిగారు. తాము నాగపూర్(ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్‌లో ఉంది) ఆదేశాలు పాటించడం లేదని యాష్కీ ఎద్దేవా చేశారు. నాగపూర్ లేదా అహ్మదాబాద్ ఈ రెంటిలో ఎక్కడి నుంచి వచ్చే ఆదేశాలు పాటించాలో తెలియక బీజేపీ నేతలు తికమకపడుతున్నారని పరోక్షంగా మోడీపై విమర్శలు గుప్పించారు. గుజరాత్లో అభివృద్ధిని గోరంతలు కొండతలు చేసి చెబుతున్నారని ఆయన విమర్శించారు. గుజరాత్ వాస్తవ ఆర్థికాభివృద్ధిని చూపించకుండా మాయ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో బీజేపీ సభ్యులు అనంతకుమార్ కలగజేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ ఏమీ చేయలేదని, తమ పార్టీకి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని కౌంటర్ ఇచ్చారు. మధ్యప్రవేశ్తో పాటు నాలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల సంవాదం ఆసక్తి రేకిత్తించింది.