
షీనా బోరా హత్యకేసు సీబీఐకి
ముంబై: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిష్పాక్షిక దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి కేపీ భక్షి శుక్రవారం ప్రకటించారు. ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా ఆకస్మిక బదిలీపై మీడియాలో వచ్చిన వార్తలతో ప్రభుత్వం కలత చెందిందని, ఈ కేసులో ప్రభుత్వానికి ప్రత్యేక ఆసక్తి లేదని ప్రజలకు తెలియజెప్పేందుకే సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని అన్నారు.
2012 ఏప్రిల్ 24న షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసిన విషయం విదితమే. ఈ హైప్రొఫైల్ కేసును ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా పర్యవేక్షించారు. నిందితులను ఆయనే ప్రశ్నించారు కూడా. అయితే అకస్మాత్తుగా ఈనెల 8న ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది.
దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బదిలీ జరిగినప్పటికీ షీనా కేసును మారియాయే పర్యవేక్షిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే మారియా స్థానంలో ముంబై పోలీసు కమిషనర్‌గా నియమితులైన అహ్మద్ జావేద్‌కు పీటర్, ఇంద్రాణి ముఖర్జియాలతో పరిచయముందని శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ ఆయనే అంగీకరించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.