
మహీంద్రా 300 సీసీ బైక్.. మోజో
ధర రూ.1.58 లక్షలు దీపావళి తర్వాత 20,000-30,000 వరకూ పెంపు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన మహీంద్రా టూ వీలర్స్ కంపెనీ 300 సీసీ బైక్, మోజోను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ బైక్ ధరను రూ.1.58 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపనీ పేర్కొంది. వివిధ వినూత్నమైన ఫీచర్లతో ఈ బైక్‌ను అందిస్తున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. ఇది ప్రారంభ ధర మాత్రమేనని, దీపావళి తర్వాత ధరను సవరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబై, పుణే, ఢిల్లీ, బెంగళూరు- ఈ నాలుగు నగరాల్లోనే ఈ బైక్‌ను విక్రయించనున్నామని, తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మోజో బైక్‌లో అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇగ్నీషన్, ఇరిడీయమ్ స్పార్క్ ప్లగ్, రెసోనేటర్ ఫిట్టెట్ ఇన్‌టేక్ సిస్టమ్, రెండు ఎగ్జాస్‌లు వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. . 21 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉందని, ఈ కేటగిరీలో అతి పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న బైక్ ఇదేనని తెలిపారు.
మోజోట్రైబ్ ఏర్పాటు..
మోజో యజమానులతో మోజోట్రైబ్ కమ్యూనిటీని ఏర్పాటు చేస్తున్నామని మహీంద్రా ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఫార్మ్ ఎక్విప్‌మెంట్, టూ వీలర్ డివిజన్) రాజేశ్ జుజురికర్ చెప్పారు. ఈ మోజో ట్రైబ్ సభ్యులు కలసిమెలసి లాంగ్ రైడ్స్‌ను నిర్వహించి ఆనందం పొందుతారని పేర్కొన్నారు.