ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
జైపూర్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మహేశ్‌చంద్ శర్మ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అంశం కేంద్ర పరిధిలోనిది కనుక కేంద్రంతో కలసి పనిచేయాలని పేర్కొన్నారు. ఆవును వధించేవారికి జీవిత ఖైదు పడేలా చూడాలనీ సూచించారు. ఆవుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌లు చట్టబద్ధ సంరక్షకులుగా ఉండాలన్నారు. ‘హిందూ దేశమైన నేపాల్ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించింది. భారత్ పశుపెంపకంపై ఆధారపడిన వ్యవసాయిక దేశం. 48, 51ఏ(జీ) రాజ్యాంగ అధికరణల ప్రకారం.. ఆవుకు చట్టబద్ధ హోదా కల్పించేందుకు రాష్ట్రం చర్యలు తీసుకోవాలి.. ఆవును చంపేవారికి జైలు శిక్షను మూడేళ్ల నుంచి జీవిత ఖైదుకు పెంచేందుకు రాష్ట్ర చట్టాన్ని సవరించాలి’ అని జస్టిస్ శర్మ తన 145 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. జడ్జిగా ఆయన పదవీకాలం బుధవారమే ముగిసింది.
జైపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హింగోనియా గోశాలలో వందలాది ఆవులు చనిపోయిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత జస్టిస్ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ తన ఆదేశాలు సిఫార్సుల కిందికి వస్తాయని, వాటికి కట్టుబడటం తప్పనిసరేమీ కాదన్నారు. ‘గోవును వధించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరడం నా ఆత్మఘోష, మీ ఆత్మఘోష, అందరి ఆత్మఘోష... ఆవు తల్లివంటిది. పలు వ్యాధుల నుంచి కాపాడుతుంది’ అని అన్నారు. జాతీయ పక్షి నెమలి శృంగారంలో పాల్గొనదని, ఆడ నెమలి.. మగనెమలి కన్నీటిని సేవించే సంతానోత్పత్తి చేసుకుంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు. గోవు కూడా నెమలి అంత పవిత్రమైనదని వెల్లడించారు.
జోక్యానికి కేరళ హైకోర్టు నిరాకరణ
తిరువనంతపురం: పశువధపై కేంద్రం తీసుకొచ్చిన నిషేధం విషయంలో జోక్యానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. కేంద్ర నోటిఫికేషన్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, బీఫ్ అమ్మకం, వినియోగంపై అందులో నిషేధం లేదని పేర్కొంది. నిషేధంపై చర్చించడానికి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.