
సాగరగర్భంలో విమానం కోసం వెతుకుదాం.. ప్లీజ్
రెండు వారాల క్రితం అత్యంత అనుమానాస్పద రీతిలో అదృశ్యమైపోయిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ 370 కోసం సాగరగర్భంలో గాలించేందుకు తగిన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించాలని అమెరికాను మలేషియా కోరింది. 239 మంది ఉన్న ఈ విమానం ఏమైపోయిందో తెలియక ఇప్పటికీ గాలిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో పెంటగాన్కు మలేషియా నుంచి ఫోన్లు వెళ్లాయి. మలేషియా రక్షణ మంత్రి, తాత్కాలిక రవాణా శాఖ మంత్రి హిషాముద్దీన్ హుస్సేన్ అమెరికా రక్షణశాఖ కార్యదర్శి చక్ హాగెల్కు ఫోన్ చేశారు. సాగరగర్భంలో ఎక్కడో ఉందని భావిస్తున్న విమానం ఆచూకీ తెలుసుకోడానికి కావల్సిన పరికరాలు అందించాలని ఆయన కోరినట్లు పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు ఈనెల 8వ తేదీన బయల్దేరిన విమానం అత్యంత ఆనుమానాస్పద పరిస్థితులలో అదృశ్యమైంది. ఈ విమానంలో ఐదుగురు భారతీయులు, దాదాపు 150 మంది చైనీయులు సహా మొత్తం 239 మంది ఉన్నారు.
ఈ విమానం ఆచూకీ కనుక్కోవడానికి సాగరగర్భంలో గాలింపు సాగించేందుకు కావల్సిన పరిజ్ఞానం తమ సైన్యం వద్ద అందుబాటులో ఉందో లేదో చూసి.. వీలైనంత త్వరలోనే తెలియజేస్తామని హిషాముద్దీన్కు హేగెల్ హామీ ఇచ్చారు. అసలు తమవద్ద ఎలాంటి పరికరాలు ఉన్నాయో, ఏవేంటి ఇస్తామోనన్న విషయాలు మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఇప్పటికి 26 దేశాలకు చెందిన బృందాలు ఇప్పటికీ ఎంహెచ్ 370 విమానం కోసం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అయితే, సాగరగర్భంలో గాలించాలంటే దాదాపు 25 కోట్ల రూపాయల ఖర్చవుతుందని పెంటగాన్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికి ఆ మొత్తం సిద్ధంగా ఉంచామని పెంటగాన్ ప్రతినిధి స్టీవ్ వారెన్ చెప్పారు.