
నిత్య పెళ్లికొడుకు కోసం గాలింపు
మరో పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువతిని ప్రేమ పేరుతో ప్రలోభపెట్టి ఓ యువకుడు తీసుకెళ్లిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
బంజారాహిల్స్ (హైదరాబాద్): మరో పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువతిని ప్రేమ పేరుతో ప్రలోభపెట్టి ఓ యువకుడు తీసుకెళ్లిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికనగర్‌లో నివసించే సయ్యద్ నిసార్ సొహైల్(27) మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సొహైల్ రెండో భార్యను వదిలేసి ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా, సొహైల్ ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని(23)తో సన్నిహితంగా మెలుగుతున్నాడు.
అయితే, ఆ యువతికి వచ్చే నెల 1న పెళ్లి నిర్వహించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ లోపే సొహైల్, ఆ యువతి ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సొహైల్‌పై మూడు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.