
కేజ్రీవాల్‌పై ‘రంగు పడింది’
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి నల్లరంగు చల్లాడు. కేజ్రీవాల్ సోమవారం పార్టీ నేతలతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ సమావేశ వేదిక వద్దకు వస్తుండగా, ‘అన్నా హజారే జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ దూసుకొచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై ఒక డబ్బాతో నల్లరంగు చల్లడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో కేజ్రీవాల్ ముఖంపై కొంత రంగు పడింది. ఆయన పక్కనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, సంజయ్ సింగ్‌లపైనా రంగు పడింది.
తాను బీజేపీ అహ్మద్‌నగర్ శాఖ ప్రధాన కార్యదర్శి నచికేత వాఘ్రేకర్‌గా చెప్పుకున్న ఆ వ్యక్తి రంగు చల్లడంతో పాటు కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించడంతో పార్టీ కార్యకర్తలు అతడిని బలవంతంగా బయటకు తీసుకుపోయారు. కేజ్రీవాల్ తన గురువైన హజారేతో పాటు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నారని వాఘ్రేకర్ ఆరోపించాడు. కేజ్రీవాల్ స్పందిస్తూ, తమ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఓర్వలేని వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నిస్పృహతోనే బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. మరోవైపు, తమ పార్టీ కార్యకర్త నల్లరంగు చల్లినట్లు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా తాము ఆమోదించబోమని బీజేపీ నేత వీకే మల్హోత్రా అన్నారు.
కేజ్రీవాల్‌కు హజారే లేఖ
లోక్‌పాల్ ఉద్యమం కోసం 2011లో వసూలు చేసిన విరాళాల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి వాడుకుంటోందని ఆరోపణలు రావడంతో అన్నా హజారే ఈ విషయమై ఆదివారం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. లోక్‌పాల్ ఉద్యమం కోసం వసూలు చేసిన నిధులను తాను ఖర్చు చేయలేదని, ఈ విషయమై ఎలాంటి దర్యాప్తును ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనని కేజ్రీవాల్ ఆయనకు బదులిచ్చారు. దర్యాప్తు నివేదికను 48 గంటల్లోగా బయటపెట్టాలని అన్నారు. తాను దోషిగా తేలితే పోటీ నుంచి తప్పుకుంటానని, అయితే, తాను సచ్ఛీలుడిగా తేలితే హజారే తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని అన్నారు. కేజ్రీవాల్‌పై ఓ వ్యక్తి నల్లరంగు చల్లడాన్ని హజారే ఖండించారు.